Pages

Thursday 31 May 2012

రామాయణం @ కధ -76


అటుపక్క లంకలో మంత్రులతో కూర్చుని దీనంగా తల దించుకుని రావణుడు ఉన్నాడు. అప్పుడాయన వాళ్ళతో " జెరగకూడని పని జెరిగిపోయింది. నేను సీతని అపహరించిన విషయం మీ అందరికి తెలుసు కదా. రాముడు నా మీదకి యుద్ధానికి వస్తున్నాడు. నిన్న హనుమంతుడు ఒక్కడే వచ్చి ఈ లంకా పట్టణాన్ని ఎంత పీడించాడొ మీరు చూశారు. ఈ మాట చెప్పడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. రాముడు సముద్ర తీరానికి వచ్చేశాడు, ఎలాగోలా సముద్రాన్ని దాటుతాడు (తన గూఢచారుల వల్ల రాముడు సముద్ర తీరానికి వచ్చాడని రావణుడు తెలుసుకున్నాడు). అప్పుడు మనం రామలక్ష్మణులతోవానరములతో యుద్ధం చెయ్యాల్సి ఉంటుంది. మీరందరూ కలిసికట్టుగా నాకు ఒక ఆలోచన చెప్పండి. మంత్రులందరూ ఎకాభిప్రాయంగా చెప్పిన మాట, ఉత్తమమైన మాటమంత్రులు తమలో తాము విభేదించుకుని, తమ విభేదాలు పక్కకి పెట్టి కలిసి ఒక్కటిగా చెప్పిన మాట, మధ్యమమైన మాట. మంత్రులు విడిపోయి, ఎవరిమానన వాళ్ళు తలోమాట చెబితే, అది అధమమైన మాట. అందుకని నాకు ఒక మంచి మాట చెప్పండి " అన్నాడు.


అప్పుడా మంత్రులన్నారు " ప్రభు! మీరు దేనికింత బెంగ పెట్టుకుంటున్నారు. మీరు ఒకనాడు హిమాలయాలలో ఉన్న మీ అన్న కుబేరుడితో యుద్ధం చేసి, ఆయనని ఓడించి పుష్పక విమానం ఎత్తుకొచ్చారు. ఆయన ఉన్న ఇంట్లో నుంచి ఆయనని తరిమేసి ఈ లంకా పట్టణాన్ని మీదిగా స్వాధీనం చేసుకున్నారు. నీ చెల్లెలైన కుంభీనస యొక్క భర్త అయిన మధువుని ఓడించి అక్కడి నుంచి తెచ్చుకోవలసిన వస్తువులన్నీ తెచ్చుకున్నారు. పాతాళ లోకంలోకి వెళ్ళి అక్కడున్న నాగులనితక్షకి, జటి మొదలైన వాళ్ళని ఓడించి అపారమైన కీర్తి గడించారు. అక్కడి నుంచి దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుడిని ఓడించారు. తరువాత యమలోకానికి వెళ్ళి యముడిని ఓడించారు, యముడు మిమ్మల్ని చూసి పారిపోయాడు. ఇంతమందిని కొట్టిన మీరు ఎందుకు భయపడుతున్నారు. మీ దెగ్గర ఇంద్రజిత్ ఉన్నాడు, ఇంద్రజిత్ ముందు ఆ రాజకుమారులు ఎంత " అన్నారు.

ఇంతలో మంత్రులలో ఒకడైన ప్రహస్తుడు లేచి " రావణ! నువ్వు భయపడవద్దు, నేను ఒక్కడిని యుద్ధానికి వెళితే చాలు. ఆ రామలక్ష్మణులిద్దరిని సంహరించి వస్తాను. నిన్నటి రోజున ప్రమత్తంగా ఉండడం వలన ఆ వానరాన్ని పట్టుకోలేకపోయాము " అన్నాడు.

అప్పుడు దుర్ముఖుడు అనే మంత్రి అక్కడికి రక్తంతో తడిసిన పరిఘని పట్టుకొచ్చి " నేను ఒక్కడినే వెళ్ళి ఈ పరిఘతో వాళ్ళని కొట్టి వచ్చేస్తాను " అన్నాడు.

అప్పుడు వజ్రదంష్ట్రుడు " రాముడిని మోసం చేసి గెలిచే ఒక గొప్ప ప్రణాలిక నీకు చెబుతాను. మన దెగ్గర కామరూపులైన రాక్షసులు ఉన్నారు. వాళ్ళందరినీ భరతుడి సైన్యంలా రూపం మార్చమని చెప్పి రాముడి దెగ్గరికి పంపి ' అయోధ్యలో ముఖ్యమైన పని వచ్చింది, భరతుడు చాలా కష్టంలో ఉన్నాడు, అందుకని నిన్ను తొందరగా రమ్మన్నాడు ' అని రాముడితో చెబుతారు. భరతుడి మీద ఉన్న ప్రేమ చేత రాముడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో మన సైన్యం సముద్రాన్ని దాటి రాముడిని కొట్టేస్తుంది, అప్పుడు వానరులందరూ దిక్కులు పట్టి పారిపోతారు. మీరు అనుజ్ఞ ఇవ్వండి, ఒక్క నిమిషంలో వెళ్ళిపోతాము " అన్నాడు. 

అప్పుడు నికుంభుడు(కుంభకర్ణుడి కుమారుడు) అన్నాడు " దీనికింత మోసం ఎందుకు, నేను వెళ్ళి వాళ్ళని చంపేసి, రామలక్ష్మణులని తినేసి వస్తాను " అన్నాడు.


అప్పుడు విభీషణుడు " 3 విషయాలున్న శత్రువు విషయంలోనే యుద్ధానికి సిద్ధపడాలి. ఆ రాజు ఏమర పాటుతో ఉంటె యుద్ధానికి వెళ్ళడం తేలిక, మరొక శత్రువుతో పీడింపబడుతున్న రాజు మీదకి వెళ్ళడం తేలిక, దైవము ప్రతికూలంగా ఉన్న రాజుమీదకి వెళ్ళడం తేలిక. ఈ మూడు లోపాలు ఉన్న రాజు మీదకి దండయాత్ర చెయ్యడం తేలిక. కాని, మీరందరూ రాముడిని చంపేస్తాము, కొట్టేస్తాము అని ఎగురుతున్నారే, రాముడంటె అంత చేతకాని వాడిలా కనపడుతున్నాడ. రాముడు ఇవ్వాళ యుద్ధానికి వచ్చాడు, అప్రమత్తుడై ఉన్నాడు, దైవము ఆయన పట్ల అనుకూలించి ఉంది. మీరు భరతుడి సైన్యం వేషాలు కట్టుకొని వెళితే తెలుసుకోలేనంత మూర్ఖుడు కాదు. నదులకు(తూర్పు దిక్కుకి ప్రవహించేవాటిని నదులు అంటారు), నదములకు(పశ్చిమ దిక్కుకి ప్రవహించేవాటిని నదములు అంటారు) భర్త అయిన సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకి నిన్న హనుమ వచ్చి లంకా పట్టణం అంతటినీ కాల్చేశారు. మరి నిన్న మీరు హనుమని ఎందుకు పట్టుకోలేకపోయారు? ఇన్ని కోట్లమంది ఇక్కడికి వచ్చినవాడిని పట్టుకోలేకపోయారు. మీరందరూ ఇవ్వాళ ప్రభువు దెగ్గర నిలబడి నేను కొట్టేస్తాను, నేను చంపేస్తాను, నేను తినేస్తాను అంటున్నారు. ఇవి మంత్రులు చెప్పవలసిన మాటలేనా? మీ మాటలకి ఆలోచన కాని, విచక్షణ కాని ఉందా. యుద్ధానికి వెళ్ళేముందు శత్రుసైన్యం యొక్క బలం ఎంత ఉంది అని జాగ్రత్తగ అంచనా వెయ్యాలి. అందులో పక్షపాత బుద్ధి ఉండకూడదు. శత్రువుకి మనకన్నా ఎక్కువ బలం ఉంటె వేరొక మార్గాన్ని ఆలోచించాలి, శత్రువు కన్నా మనకే ఎక్కువ బలం ఉంటె, ఆనాడు యుద్ధానికి వెళ్ళాలి. అసలు శత్రువు బలం ఏమిటో, ఎంత మంది వస్తున్నారో, ఎవరు ఎటువంటి వారో మీరు అంచనా వేశార?

మీరు ఒక్కసారి ఆలోచించండి, రాముడు యుద్ధానికి రావలసిన అవసరం ఏమిటి? రాముడి భార్య అయిన సీతమ్మని మా అన్న రావణుడు ఎత్తుకొచ్చి అశోక వనంలో పెట్టాడు. అందుకని రాముడు తన భార్యని విడిపించుకోవడానికని యుద్ధానికి వస్తున్నాడు. ధర్మం రాముడి పట్ల ఉంది, ధర్మం ఎక్కడుంటె దేవతలు అక్కడ ఉంటారు, కావున దేవతల అనుగ్రహం రాముడికి ఉంటుంది. మీరు రాముడి మీదకి యుద్ధానికి వెళదామని ఎలా అనుకుంటున్నారు. ఏ రకంగా చూసినా రాముడిదే పైచేయి. లంకకి, రాక్షసులకి, రావణుడికి ఉపద్రవం రాకూడదు అనుకుంటె, ఏ సీతమ్మ కారణంగా ఇటువంటి కలహం వస్తోందో, ఆ సీతమ్మని రాముడికి అప్పగిస్తే రాముడు యుద్ధానికి రాడు. తప్పు చేసింది మనం, ఆ తప్పుని సమర్ధించుకోడానికి ఇన్ని కోట్ల మందిని ఫణంగా పెట్టడం మంచిది కాదు. నా మాట విని సీతమ్మని ఇచ్చెయ్యండి " అన్నాడు.

విభీషణుడు చెప్పిన మంచి మాటలు చెవికి ఎక్కని రావణుడు తన మంత్రులని ఆ సభ నుండి వెళ్ళమని చెప్పి, తాను కూడా వెళ్ళిపోయాడు. 


విభీషణుడు మరునాడు ఉదయం రావణుడు ఉన్న గృహానికి వెళ్ళాడు. అక్కడ కొన్ని వేల మంది స్త్రీలు ఉన్నారు, బ్రాహ్మణులు స్వస్తి వాచకాలు చెబుతున్నారు, పూజలు, అగ్నికార్యాలు జెరుగుతున్నాయి. రావణుడు ఒక మంచి తల్పం మీద కూర్చుని ఉండగా విభీషణుడు అక్కడికి తల వంచి నమస్కరిస్తూ వెళ్ళి " అన్నయ్య! నిన్న నీకు సభలో కొన్ని విషయాలు చెబుతుంటే వెళ్ళిపోయావు కదా. నీకు కొన్ని విషయాలు ఆంతరముగా చెబుదాము అనుకున్నాను. ఎందుకంటే, ఈ విషయాలు లంకలో అందరికీ తెలుసు. నీ మంత్రులకి కూడా తెలుసు. కాని నీకు భయపడి ఎవరూ నీతో చెప్పడం లేదు. నేను కూడా చెప్పకపోతె నా అన్నని రక్షించుకోనివాడిని అవుతానని, నీ మీద ప్రేమ చేత చెప్పడానికి వచ్చాను. 

నువ్వు ఏనాడైతే సీతమ్మని అపహరించి లంకకి తీసుకోచ్చావో, ఆనాటి నుంచి నాకు కొన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. ఎప్పుడైనా హోమం చేద్దామని నాలుగు పుల్లలు ఆ హోమగుండంలో వేస్తే, ప్రారంభం నుంచి కూడా అగ్ని పెద్దగా పైకి రావడం లేదు, పొగ చుట్టుముట్టి ఉంటోంది. అన్ని హోమగుండాలలోని అగ్ని కూడా పొగతోనే ఉంటుంది, నిప్పురవ్వలు బయటకి కనపడుతున్నాయి. అగ్నిశాలలోకి, వేదశాలలోకి, పూజా గృహంలోకి విశేషంగా పాములు వస్తున్నాయి. అన్నిటినీ మించి తెల్లవారుజామున హోమం చేద్దామని పాయసం కాని, తేనె కాని పెట్టుకుంటె, వాటినిండా చీమలు పట్టి ఉంటున్నాయి. ఇవన్నీ కూడా అమంగళకరమైన శకునములు

ఆవు పాలు తీసుకొచ్చి పెట్టగానే అవి విరిగి పోతున్నాయి. ఏనుగులకు మదజలాలు కారకుండా అలా నిలబడి ఉంటున్నాయి. గుర్రాలు ఉత్సాహంగా సకిలించడం లేదు, దీనంగా సకిలిస్తూ కన్నుల వెంట నీరు కారుస్తున్నాయి. గాడిదలు, కంచర గాడిదలు, ఒంటెలు మొదలైన జంతువుల మీద ఉన్న వెంట్రుకలు తమంతట తాముగా ఊడి పడిపోతున్నాయి. పశు వైద్యులని తీసుకొచ్చి వాటికి వైద్యం చేయించినా, ఈ జాతి మృగాల మీద వెంట్రుకలు నిలబడడం లేదు. కాకులు గుంపులు గుంపులుగా వచ్చి ఇళ్ళ మీద కూర్చుని అదే పనిగా అరుస్తున్నాయి. ప్రతిరోజు గ్రద్దలు ఇళ్ళ మీద కూర్చుంటున్నాయి. అరణ్యంలో ఉండే నక్కలు పగటివేళ, రాత్రివేళ ఊరి పోలిమేరలకొచ్చి పెద్దగా ఏడుస్తూ అరుస్తున్నాయి. క్రూరమైన మృగాలు భయంకరమైన ధ్వనులు చేస్తున్నాయి. అందుకని సీతమ్మని తీసుకెళ్ళి మనం రాముడికి అప్పచెప్పేద్దాము " అన్నాడు.

అప్పుడు రావణుడు విభీషణుడి వంక కోపంగా చూసి " ఇవన్నీ నీకు ఎక్కడ కనపడుతున్నాయి రా. నాకు ఎక్కడా కనపడడం లేదు. రాముడు యుద్ధానికి దేవేంద్రుడిని తీసుకొచ్చినా సరే, సీతని ఇవ్వను. ఇక నువ్వు వెళ్ళవచ్చు " అన్నాడు. విభీషణుడు తల వంచుకొని వెళ్ళిపోయాడు. 

తన మనస్సు నిరంతరము పరకాంత యందు ఉండుట చేత, సోదరుడు చెప్పిన మంచి మాట వినకపోవడము చేత రావణాసురుడు రోజురోజుకి కృశించిపోవుచున్నాడు. 

Wednesday 30 May 2012

రామాయణం @ కధ -75

                            యుద్ధకాండ  ప్రారంభం



హనుమ చెప్పిన మాటలని విన్న రాముడు ఎంతగానో సంతోషించి " హనుమ! నువ్వు చేసిన కార్యము సామాన్యమైన కార్యము కాదు. 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకా పట్టణంలోకి వెళ్ళడం అనేది మానసికంగా కూడా ఎవ్వరూ ఊహించని పని. సముద్రాన్ని దాటి రాక్షసుల చేత, రావణుడి చేత పరిరక్షింపబడుతున్న లంకా పట్టణంలో ప్రవేశించి, సీత దర్శనం చేసి, ప్రభువు చెప్పిన దానికన్నా ఎక్కువగా ఆ కార్యము నిర్వహించి, ఎటువంటి అవమానము పొందకుండా తిరిగి రావడం అనేది సామాన్యమైన పనికాదు.

సేవకులు మూడు రకాలుగా ఉంటారు, ప్రభువు చెప్పిన పనికన్నా తనలో ఉన్న సమర్ధత చేత ఎక్కువ పనిని చేసి ప్రభువు యొక్క మనస్సు గెలుచుకోగలిగిన సమర్ధత కలిగినవాడు ఉత్తమమైన సేవకుడు. ప్రభువు చెప్పిన పనిని చేసి, అంతకన్నా ఎక్కువ చెయ్యగలిగిన సామర్ధ్యం ఉన్నప్పటికీ, ప్రభువు చెప్పలేదు కనుక మనకెందుకులే అనుకునేవాళ్లు మధ్యములు. తనకి చెయ్యగలిగే సమర్ధత ఉన్నా, నేనెందుకు చెయ్యాలి అని ప్రభువు చెప్పిన పనిని చెయ్యనివాడు ఎవడు ఉంటాడో వాడు అధముడు. ఇవ్వాళ నిన్ను నీవు ఉత్తమమైన సేవకుడిగా నిరూపించుకున్నావు. నా క్షేమ వార్త సీతకి చెప్పి, ఆమె మనసులో ఉన్న దైన్యాన్ని, బాధని తొలగించి సుఖాన్ని పొందేటట్టుగా నువ్వు ప్రవర్తించావు. సీత జాడ తెలియక బాధపడుతున్న నాకు సీత జాడ చెప్పి సంతోషపెట్టావు. నీకు నేను ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలను. ఇవ్వాళ నీకు ఇవ్వటానికి నా దెగ్గర ఎటువంటి వస్తువు లేదు. నా దెగ్గర ఉన్నది ఈ దేహమే, అందుకని నా దేహంతో నీ దేహాన్ని గాఢాలింగనం చేసుకుంటాను " అని, హనుమని దెగ్గరికి తీసుకుని గట్టిగ కౌగలించుకున్నాడు.




తవువాత రాముడన్నాడు " అంతా బాగానే ఉంది కాని, ఆ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఎవరు వెళతారు. మనకున్న ఈ వానర సముహంతో ఆ సముద్రాన్ని దాటి ఎలా వెళ్ళగలుగుతాము. అందులో క్రూరమైన రాక్షసులుతిమింగలాలుమొసళ్ళు మొదలైనవి ఎన్నో ఉంటాయి కదా......." అని రాముడు ఆలోచిస్తున్న సమయంలో సుగ్రీవుడు ఒక మాట అంటాడు, " రామ! నువ్వు శోకాన్ని పొందకు. నీకున్న ఉత్సాహమునుపౌరుష పరాక్రమములను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు కోదండం పట్టుకొని నిలబడిననాడు నీముందు నిలబడగలిగిన మొనగాడు ఎవడు. నువ్వు సమస్త బ్రహ్మండములను శాసించగలిగిన వాడివి. నువ్వు ఆజ్ఞాపిస్తే నీ వెంట రావడానికి సమస్త వానర సైన్యము సిద్ధంగా ఉంది. ఒకసారి వానర సైన్యము లంకా పట్టణంలో అడుగుపెట్టిందంటే, రావణుడు నిహతుడయ్యిపోయినట్టే. అందుకని సముద్రాన్ని దాటడం ఎలాగన్న విషయం మీద నీ దృష్టి కోణాన్ని నిలిపి ఒక మంచి మార్గాన్ని మాకు ఉపదేశం చెయ్యి " అన్నాడు.



సుగ్రీవుడి మాటలకి ఉత్సాహం పొందిన రాముడు " నిజమే, నేను తలుచుకుంటె నా తపఃశక్తి చేత ఈ వానరములను సముద్రాన్ని దాటించగలను. నేను తలుచుకుంటె నా అస్త్ర ప్రయోగం చేత సముద్రాన్ని ఇంకింప చేస్తాను " అని చెప్పి, హనుమ వంక తిరిగి " హనుమా! ఆ లంకా పట్టణం యొక్క బలం ఏమిటో నాకు చెప్పు. అక్కడ సైన్యం ఎంత ఉంటుంది. ద్వారములుదుర్గములు ఎలా ఉంటాయి " అని అడిగాడు.


అప్పుడు హనుమంతుడు " ఆ లంకా పట్టణం 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళితే  త్రికూటా పర్వత శిఖరాల మధ్యన ఉంటుంది. అది శత్రు దుర్భేధ్యమైనదిదేవదానవులు కూడా దానిని ఆక్రమించలేరు. ఆ లంకా పట్టణం చుట్టూ ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది, అందులో ఒక విశాలమైన అగడ్త నిర్మించారు. దానిమీద నాలుగు వైపులా నాలుగు వంతెనలు ఉంటాయి. ఈ వంతెనల మీద సర్వకాలముల యందు కొన్ని వందల శతఘ్నులు సిద్ధం చెయ్యబడి ఉంటాయి. దానితో పాటు ఆ లంకకి నాలుగు దుర్గాలున్నాయి, అరణ్యంలో ఉన్న దుర్గానికి అరణ్య దుర్గము అని పేరు. నది చేత రక్షింపబడుతున్న దుర్గానికి నదీ దుర్గము అని పేరు. పర్వతము చేత రక్షింపబడుతున్న దుర్గానికి పర్వత దుర్గము అని పేరు. కృత్రిమంగా నిర్మించిన దుర్గానికి కృత్రిమ దుర్గము అని పేరు. ఆ లంకా పట్టణము ఈ నాలుగు దుర్గములతోటి శోభిల్లుతోంది. లంకకి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉన్నాయి. తూర్పు ద్వారం దెగ్గర 10,000 మంది రాక్షసులు ఆయుధములు పట్టుకొని గుర్రాల మీదఏనుగుల మీద తిరుగుతూ కాపు కాస్తుంటారుదక్షిణ ద్వారాన్ని లక్ష మంది సైనికులు కాపు కాస్తుంటారు. పది లక్షల మంది పశ్చిమ ద్వారాన్ని కాపు కాస్తుంటారు. కోటి మంది సైనికులు ఉత్తర ద్వారాన్ని కాపు కాస్తుంటారు. ఆ రాక్షసులకి యుద్ధం చెయ్యడమంటే మహా ప్రీతికరమైన విషయం. రాజద్వారమునకు భయంకరమైన ఇనుప గడియలుపరిఘలు బిగించి ఉంటాయి. ఆ లంకని చేరుకొని యుద్ధం చెయ్యడం అంత సామాన్యమైన విషయం కాదు. 



మీరు కాని ఆజ్ఞాపిస్తే ఒక సుషేణుడుగంధమాదనుడు, నీలుడునలుడుద్వివిదుడుమైందుడుసుగ్రీవుడుఅంగదుడు లంకని సర్వనాశనం చేసేస్తారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడున్న మొత్తం రాక్షస సైన్యంలో ఒక వంతు సైన్యాన్ని నాశనం చేశాను. అక్కడున్న అనేక వంతెనలలో ఒక వంతెనని పూర్తిగా విరిచేశాను. అనేక ప్రాసాదాలని విరగొట్టాను. ప్రస్తుతం లంక చెదిరిపోయిన శోభతో ఉంది, రాక్షసులు ఉద్విగ్నులై ఉన్నారు. వాళ్ళతో యుద్ధం చెయ్యడానికి ఇది చాలా అనువైన సమయం అని నేను అనుకుంటున్నాను " అన్నాడు.



అప్పుడు సుగ్రీవుడు " నాకన్నీ శుభనిమిత్తములు కనపడుతున్నాయి. నా మనస్సులో ఉత్సాహం పరవళ్ళు తొక్కుతోంది. మనం ఆ సముద్రాన్ని సేతువు కట్టి దాటితే రావణుడు నిహతుడు అయిపోయినట్టే. మంచి ముహూర్త నిర్ణయం చెయ్యండి, మనం బయలుదేరదాము " అన్నాడు.



అప్పుడు రాముడు " మనం ఈ ఆలోచన చేస్తున్న సమయంలో సూర్యుడు ఆకాశంలో మధ్యన ఉన్నాడు. ఈ రోజున ఉన్న విశాఖ నక్షత్రం మా ఇక్ష్వాకు వంశీయులది, ఈ రోజున ఉన్న ముహూర్తాన్ని విజయము అని పిలుస్తారు. ఈ ముహూర్తం చాలా బాగుంది కనుక మన వెంటనే సైన్యాన్ని తీసుకొని బయలుదేరదాము " అన్నాడు. 



రాముడు ఈ మాట అనగానే అక్కడున్న వానరములన్నీ సంతోషాన్ని పొంది " జై శ్రీరాం, జై జై రామ, బయలుదేరదాము, లంక చేరిపోదాము, రావణుడిని సంహరిద్దాము " అన్నాయి.



తరువాత రాముడు సుగ్రీవుడితో " వృద్ధులైన వారు, శరీరంలో శక్తిలేని వారు, దెబ్బలు తిని ఉన్నవారు, నిస్సత్తువతో ఉన్నవారు, ఇటువంటి వానరములని తీసుకొని రావద్దు. మొదట నీలుడు వెళ్ళాలి, ఆయనతో పాటుగా విశేషమైన బలం కలిగిన లక్ష వానరములు వెళ్ళాలి. మిగతా వానరాలన్నీ రావడానికి కావలసిన త్రోవని వారు నిర్ణయించాలి. అందరూ వెళ్ళడానికి అనువైన రీతిలో ఉన్న రహదారిని నిర్మించాలి. కొన్ని గంటలు ప్రయాణం చేశాక అందరూ బడలిపోతారు, అప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి చక్కని వృక్ష సముదాయం ఉండాలి, తాగడానికి మంచి నీరు దొరకాలి, పళ్ళుతేనె దొరకాలి, అటువంటి అరణ్య మార్గాన్ని నీలుడు నిర్ణయించాలి. ఈ సైన్యం అంతా వెళుతున్నప్పుడు గజుడు, గవాక్షుడుగవయుడు సైన్యానికి ముందు నడుస్తూ వెళ్ళాలి. ఈ సైన్యాన్ని కుడి పక్కన ఋషభుడు చూస్తూ వాళ్ళని రక్షించాలి. ఎడమ పక్కన గంధమాదనుడు కొన్ని లక్షల మంది వానరములతో ఆ సైన్యాన్ని రక్షించాలి. అలాగే వెనుక కూడా కొన్ని లక్షల వానరములు రక్షిస్తూ రావాలి. 




వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో సరస్సులు ఉంటాయి. అటువంటి సరోవరాలలొ శత్రువులు విషం కలిపి నాశనం చేస్తారు. ఆ విషపూరిత జలాలను తాగితే వానరులందరు కూడా శరీరాలని విడిచిపెట్టే ఉపద్రవం ఏర్పడవచ్చు. అందుకని చాలా ముందుగా వెళ్ళి అటువంటి నీటి సరోవరాలకిసరస్సులకి ప్రమాదం ఏర్పడకుండా కాపలా కాయాలి. నేను సైన్య మధ్య భాగంలో హనుమ భుజాల మీద కూర్చుని వస్తాను. అంగదుడి భుజాల మీద లక్ష్మణుడు బయలుదేరతాడు. జాంబవంతుడు మొదలైనవారు ఈ వానర సైన్యాన్ని అన్నివైపులా రక్షిస్తూ ఉండాలి " అని చెప్పాడు.

అప్పుడా వానర సైన్యం అంతా బయలుదేరింది. అప్పుడా సైన్యంలో కొంతమంది వెనుక నడవకుండా ముందుకొచ్చి నడుస్తున్నారు. రాముడికి పక్కన నడుస్తున్నవారు అంటున్నారు " ఒరేయ్! చూడరా లంకకి వెళ్ళగానే రావణుడిని ఏమి చేస్తానో " అని ఒకడు, " నేను ఒక్క గుద్దు గుద్దానంటే వాడి తలకాయలు పగిలిపోతాయి. చూడరా నా కండ " అని రాముడికి వినపడేటట్టుగా తమ ప్రతాపాలు చెప్పుకుంటున్నారు. ఆ సైన్యంలో బలంగా ఉన్నవాళ్ళు మెల్లగా నడుస్తున్నవారిని ఎత్తి పక్కకు పారేసి ముందుకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది తొందరగా వెళ్ళాలని పర్వతాల మీద ఎక్కి వెళుతున్నారు. కొంతమంది చెట్లని పీకేసి వాటిని గోడుగులుగా పట్టుకొని వెళుతున్నారు. వాళ్ళందరూ అలా వెళుతుంటే అరణ్యం అరణ్యమే వెళ్ళిపోతుందా అన్నట్టుగా ఉంది. అలా వాళ్ళందరూ బయలుదేరి దక్షిణ దిక్కున ఉన్న సహ్యాద్రి పర్వత శిఖరముల మీదకి చేరుకున్నారు. అప్పుడు వాళ్ళు అక్కడున్న రకరకాల పళ్ళని తిని కాలం గడిపారు. తరువాత అక్కడి నుంచి బయలుదేరి కొంచెం ముందుకి వెళ్ళగా వాళ్ళకి సముద్రం కనపడింది. వాళ్ళు సముద్రాన్ని చేరుకునేసరికి చీకటి పడింది


అప్పుడు రాముడు " మీరందరూ చాలా జాగ్రత్తగా ఈ సైన్యాన్ని విడిది చేయించి, రాక్షసుల బారిన పడకుండా ఈ వానరములను 3 భాగములు చెయ్యండి " అన్నాడు. అప్పుడు కొన్ని కోట్ల వానరములని ఒక వైపు నిలబెట్టారు, కొండముచ్చులని ఒక వైపు నిలబెట్టారు, భల్లూకాలని ఒక వైపు నిలబెట్టారు. 


చంద్రుని కాంతి కెరటాలు మీద, కదులుతున్న నీటిమీద పడి మెరుస్తుంది. చంద్రుడిని చూసి పొంగుతున్న సముద్రాన్ని, పైనున్న చంద్రుడిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. గాలి చేత తోయబడుతున్న నీరు చంద్రుని కాంతికి మెరుస్తూ వెండి పళ్ళెంలా ఉంది. పైన ఆకాశంలో ఉన్న నక్షత్రాలు సముద్రం మీద ప్రతిఫలిస్తూ, అగ్నిచూర్ణం తీసుకొచ్చి సముద్రం మీద ఎవరో చల్లేసినట్టు ఉన్నాయి. ఆకాశం సముద్రంలాసముద్రం ఆకాశంలా ఉన్నాయి, రెండిటికి తేడా తెలియడం లేదు. ఆకాశముసముద్రము రెండూ కలిసిపోయినట్టు ఉన్నాయి, ఆకాశంలో తారలు ఉన్నాయి, సముద్రంలో రత్నాలు ఉన్నాయి. కదులుతున్న మేఘాలతో ఆకాశం ఉంది, కదులుతున్న తరంగాలతో సముద్రం ఉంది, అని ఆ సముద్రం గురించి వాల్మీకి మహర్షి తనదైన శైలిలో వర్ణించారు. 



ఆ సమయంలో రాముడు సముద్రం వంక చూస్తూ " సీత లంకలో ఉండిపోయింది, నేను ఇక్కడ ఉండిపోయాను. చంద్రుడా! సీత నిన్ను చూసుంటుంది, అలా చూడబడిన నువ్వు నా వంక చూస్తే నాకు ఉపశాంతి కలుగుతుంది. అటువైపు నుంచి వస్తున్న గాలి సీతకి తగిలి వస్తే నాకు ఉపశాంతి కలుగుతుంది " అన్నాడు.  



Tuesday 29 May 2012

రామాయణం @ కధ -74


అప్పుడు కొంతమంది రాక్షసులు పరిగెత్తుకుంటూ సీతమ్మ దెగ్గరికి వెళ్ళి " నీతో కిచకిచలాడిన ఎర్రమూతి కోతి తోకకి రావణుడు నిప్పు పెట్టించాడు " అన్నారు.

సీతమ్మ వెంటనే అగ్నిదేవుడికి ప్రార్ధన చేసి " నేను సర్వకాలముల యందు రాముడికే సేవ చేసిన దాననయితే, రాముడినే మనసులో పెట్టుకున్న దాననయితే, నాకు భాగ్యవిశేషం మిగిలి ఉంటె, రాముడికి నామీద ప్రేమ ఉంటె, సుగ్రీవుడు నన్ను తీసుకెళ్ళి రాముడితో కలపడం యదార్ధమయితే, హనుమ యొక్క తోకకి నిక్షేపింపబడిన అగ్ని చల్లబడుగాక " అనింది.

వెంటనే హనుమ తోకకి ఉన్న అగ్ని వెన్నముద్దలా చల్లగా అయిపోయింది. అప్పుడాయన అనుకున్నాడు' అవునులే నేను వస్తుంటే మైనాకుడు నాకు ఆతిధ్యం ఇచ్చాడు, సముద్రుడు నమస్కారం చేశాడు. రాముడి పేరు, సీతమ్మ పేరు చెబితే ప్రకృతిలో ఉపకరించనిది ఏముంటుంది. 


నా తండ్రి వాయుదేవుడికి అగ్నిదేవుడు స్నేహితుడు, అందుకని నాకు ఇలా ఉపకారం చేస్తున్నాడు ' అని అనుకుని, ' ఈ లంకా పట్టణాన్ని కాల్చి అగ్నిదేవుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతాను ' అనుకొని, మొదట ప్రహస్తుడి ఇంట్లో నిప్పు పెట్టాడు. అలా అన్ని ఇళ్ళ మీదకి దూకుతూ నిప్పు పెడుతూ వెళ్ళిపోయాడు. రావణుడి ప్రవర్తన వల్ల ఇంతకాలం కడుపుమండిపోయి ఉన్న దిక్పాలకులు అవకాశం దొరికిందని ఆనందపడ్డారు. హనుమ అలా నిప్పు పెట్టగానే అగ్ని దేవుడు కాల్చేస్తున్నాడు, వాయుదేవుడు వేగంగా వీచి అగ్నిని పట్టుకెళ్ళి అన్ని ఇళ్ళమీద వేసేశాడు. కొన్ని చోట్ల ఆకుపచ్చగా, కొన్ని చోట్ల పచ్చగా, కొన్ని చోట్ల ఎర్రగా ఆ లంక అంతా కాలిపోతుంది. ఆ లంకలో అందరూ " హా తాత, హా పుత్ర, హా తల్లి " అని అరుచుకుంటూ దిక్కులుపట్టి పరుగులు తీశారు. అప్పుడు హనుమంతుడు సంతోషంగా వెళ్ళి త్రికూటాచల పర్వతం మీద నిలబడి చూసేసరికి, ఎదురుగా లంక లంకంతా కాలిపోతూ కనిపించింది. 


అప్పుడాయన " అరరే ఎంతపని చేశాను. అగ్నిని తీసుకెళ్ళి నీళ్ళల్లో పడేసినట్టు కోపాన్ని విడిచిపెట్టినవాడు ధన్యుడు. పాము కుబుసాన్ని విడిచినట్టు కోపాన్ని విడిచిపెట్టడం మానేసి లంకని కాల్చేశాను. ఈ లంకలో సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది. ఏ సీతమ్మ తేజస్సు చేత నా తోకని అగ్ని కాల్చలేదొ, అటువంటి సీతమ్మని అగ్ని కాలుస్తుంద . సీతమ్మే అగ్ని, అగ్నిని అగ్ని కాలుస్తుంద " అని అనుకున్నాడు. 

ఇంతలో అటుగా వెళుతున్న చారణులు(భూమికి దెగ్గరగా ఆకాశంలొ ఎగురుతూ శుభవార్తలు చెప్పే దేవ గాయకులు) " ఏమి ఆశ్చర్యం, ఇవ్వాళ ఒక వానరుడైన హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకా పట్టణాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. ఆ లంక అంతా కాలిపోతుంది, కాని శింశుపా వృక్షము, ఆ వృక్షము కింద కూర్చున్న సీతమ్మకి ఎటువంటి అపకారము జెరగలేదు. అలాగే విభీషణుడి ఇల్లుకి కూడా ఏమి జెరగలేదు " అన్నారు.

అప్పుడు హనుమంతుడు శింశుపా వృక్షం కిందన కూర్చున్న సీతమ్మ దెగ్గరికి వచ్చి" అమ్మా లంకంతా కాల్చేశాను. రావణుడికి చెప్పవలసిన మాట చెప్పేశాను, నువ్వేమి బెంగపెట్టుకోకు. వాడు ఇప్పటికే భయంతో సగం చచ్చిపోయాడు. రాముడి కోసం వాడిని వదిలేశాను, లేకపోతె వాడి పది తలకాయలు గిల్లేసేవాడిని. అమ్మా! నేను బయలుదేరతాను, తొందరలోనే నీకు పట్టాభిషేకం జెరుగుతుంది, శోకమునకు గురికాకు " అని సీతమ్మతో చెప్పి ఒక్క దూకు దూకి ఆకాశంలోకి ఎగిరి నల్లటి వనాలతో, ఎర్రటి మచ్చలు కలిగిన ఏనుగులతో ఉన్న అరిష్టం అనే పర్వతం మీద దిగి, అక్కడినుంచి బయలుదేరాడు. హనుమ ఆ పర్వతం మీద నుంచి ఎగిరేసరికి అది భూమిలోకి నొక్కుకుపోయింది. 

ఆకాశంలోని మేఘాల్ని తాగుతున్నాడ, అన్నట్టుగా ఎగురుకుంటూ వెళ్ళి ఉత్తర దిక్కున హనుమ కోసం ఎదురుచూస్తున్న వానరముల దెగ్గరికి చేరుకోగానే ఒక పెద్ద నాదం చేశాడు. అక్కడున్న వానరాలు ' ఆకాశం బద్దలయ్యిందా ' అనుకున్నారు. అప్పుడు వాళ్ళందరూ జాంబవంతుడి దెగ్గరికి వచ్చి " తాత, అంత పెద్ద అరుపు వినిపిస్తోంది, అది హనుమదేనా? " అన్నారు.

జాంబవంతుడు అన్నాడు " అది కచ్చితంగా హనుమే. హనుమకి ఒక కార్యం చెబితే అవ్వకపోవడం అన్నది ఉండదు. తాను వెళ్ళిన పని అయ్యింది కాబట్టే ఇంత పెద్ద మహానాదం చేశాడు " అన్నాడు.

హనుమని అంత దూరంలో చూడగానే వానరులంతా పరుగులు తీశారు, అప్పుడు హనుమంతుడు" చూడబడెను సీతమ్మ " అని ఒక పెద్ద కేక వేసి మహేంద్రగిరి పర్వతం మీద దిగారు. అప్పుడు జాంబవంతుడు, అంగదుడు, గంధమాదనుడు మొదలైనవారు తప్ప మిగిలిన వానరములన్నీ తమ తోకల్ని కర్రలలా నిలువుగా పెట్టి, ఆ తోకల్ని చేతులతో పట్టుకుని హనుమ దిగిన కొండ ఎక్కి, ఆయనని ముట్టుకొని పారిపోతున్నారు. అప్పుడు హనుమంతుడు గుహలో ఉన్న అంగదుడు మొదలైన వారికి తన ప్రయాణం గురించి చెప్పాడు. " నిజంగా ఆ రావణుడికి ఎంత తపఃశక్తి ఉందో, సీతమ్మని ముట్టుకుని కూడా వాడు బూడిద కాలేదు. కాని సీతమ్మ పాతివ్రత్యం చేత రావణుడు ఎప్పుడో మరణించాడు, రాముడు నిమిత్తంగా వెళ్ళి బాణం వేసి చంపడమే " అన్నాడు.

అప్పుడు అంగదుడు " అంతా తెలిసిపోయింది కదా, ఇంక రాముడికి చెప్పడం ఎందుకు. ఇలాగె వెళ్ళిపోయి ఆ రావణుడిని సంహరించి, సీతమ్మని తీసుకొచ్చి రాముడికి ఇచ్చేద్దాము " అన్నాడు. 

అప్పుడు జాంబవంతుడు " తప్పు, అలా చెయ్యకూడదు, పెద్దలు చెప్పినట్టు చెయ్యాలి తప్ప స్వతంత్రంగా చెయ్యకూడదు. ఈ విషయాలని రాముడికి చెప్పి రాముడు ఎలా చెబితే అలా చేద్దాము " అన్నాడు. 

అప్పుడు వాళ్ళందరూ ముందుకి బయలుదేరారు. అలా వాళ్ళు వెళుతుండగా వాళ్ళకి మధువనం కనపడింది. ఆ మధువానాన్ని దదిముఖుడనే వానరుడు రక్షిస్తూ ఉంటాడు. ఆ మధువనంలోని చెట్ల నిండా తేనె పట్లు ఉన్నాయి. అక్కడంతా పువ్వుల నుండి తీసిన మధువు, పళ్ళనుండి తీసిన మధువు, రకరకాలైన మధువు పాత్రలలో పెట్టి ఉంది. ఆ వానరములన్నీ అంగదుడి దెగ్గరికి వెళ్ళి " ఆ మధువనంలోని మధువుని తాగుదాము " అన్నారు. అంగదుడు సరే అనేసరికి అందరూ లోపలికి వెళ్ళి తెనేపట్లు పిండేసుకుని తేనె తాగేశారు, అక్కడున్న పాత్రలలోని మధువు తాగేశారు, అక్కడున్న చెట్లకి ఉన్న పళ్ళని తినేశారు. వారందరూ విపరీతంగా తేనె తాగడం వలన మత్తెక్కి, కొంత మంది చెట్లకింద కూర్చుని పాటలు పాడడం మొదలుపెట్టారు, పాటలు పాడుతున్నవారి వీపు మీద కొంతమంది గుద్దుతున్నారు, కొంతమంది నాట్యాలు చేస్తున్నారు, కొంతమంది కనపడ్డవారికి నమస్కారం చేసుకుంటూ వెళుతున్నారు, కొంతమంది పళ్ళు బయట పెట్టి నవ్వుతున్నారు, కొంతమంది అటూ ఇటూ నడుస్తున్నారు, కొంతమంది చెట్ల మీద నుంచి కింద పడిపోతున్నారు, కొంతమంది నిష్కారణంగా ఏడుస్తున్నారు

ఆ వానరాలు చేస్తున్న అల్లరికి దదిముఖుడి సైన్యం వస్తే, వాళ్ళని చావగొట్టి తమ వెనుక భాగాలు చూపించారు. ఆ తరువాత వచ్చిన దదిముఖుడిని కూడా చావగొట్టారు. అప్పుడాయన ఏడుస్తూ సుగ్రీవుడి దెగ్గరికి వెళ్ళి జెరిగిన విషయం అంతా చెప్పాడు. దదిముఖుడు సుగ్రీవుడితో వానర బాషలో ఏడుస్తూ మాట్లాడుతున్నాడు, మధ్య మధ్యలో హనుమ అంటున్నాడు. దదిముఖుడి మాటలు వింటున్న సుగ్రీవుడి తోక పెరుగుతుంది(వానరాలు ఏదన్నా సంతోషకరమైన వార్త వింటె తోకలు పెంచుతారు). ఒకపక్క దదిముఖుడు ఏడుస్తుంటే సుగ్రీవుడు తోక పెంచడం గమనించిన లక్ష్మణుడు కంగారుగా " అసలు ఏమయ్యింది " అన్నాడు. 

" ఏమిలేదయ్య, దక్షిణ దిక్కుకి వెళ్ళిన వానరాలు మధువానాన్ని నాశనం చేశాయంట. దక్షిణ దిక్కుకి వెళ్ళిన హనుమంతుడు తప్పకుండా సీతమ్మ దర్శనం చేసుంటాడు " అని లక్ష్మణుడితో అని, " వాళ్ళందరినీ వెంటనే ఇక్కడికి రమ్మను " అని సుగ్రీవుడు దదిముఖుడితో అన్నాడు. 

దదిముఖుడు ఆ వానరాలకి " సుగ్రీవుడు రమ్మంటున్నాడు " అని చెప్పగానే అందరూ ఆకాశంలోకి ఎగిరిపోయి కిష్కిందకి చేరిపోయారు. వాళ్ళందరూ రాముడి దెగ్గరికి వెళ్ళి " రావణుడు సీతమ్మని లంకలో శింశుపా వృక్షం కింద ఉంచాడు. సీతమ్మ చాలా బాధ పడుతుంది, మనం తొందరగా వెళ్ళి తీసుకొచ్చెయ్యాలి " అన్నారు. 

అప్పుడు రాముడు " సీత నాయందు ఎలా ఉంది? " అని అడిగాడు.

అప్పటిదాకా రాముడి చుట్టూ ఉన్న వానరాలు, ఈ ప్రశ్నకి హనుమంతుడే సమాధానం చెప్పగలడు అని ఆయనకి దారిచ్చాయి. అప్పుడు హనుమంతుడు దక్షిణ దిక్కుకి నమస్కరించి " సీతమ్మ తపస్సుని పాటిస్తుంది, నీయందు పరిపూర్ణమైన ప్రేమతో ఉంది " అని, సీతమ్మ చెప్పిన ఆనవాళ్ళన్ని చెప్పి చూడామణిని ఇచ్చి " సీతమ్మ కేవలం ఒక నెల మాత్రమే ప్రాణాలని నిలబెట్టు కుంటానంది, మనం తొందరగా బయలుదేరి వెళ్ళి రావణుడిని సంహరించి, సీతమ్మని తీసుకురావాలి " అన్నాడు.


అప్పుడు రాముడు " సీత జాడ తెలిశాక నేను ఒక్క రోజు కూడా ఉండలేను " అని ఏడ్చి, సీత ఎలా ఉందని అడిగిగాడు. అప్పుడు హనుమంతుడు సీతమ్మ యొక్క సౌశీల్యాన్ని, పాతివ్రత్యాన్ని వివరించి " నీకు సుగ్రీవుడికి కలిగిన స్నేహం చేత అమ్మ ఎంతో ప్రీతిని పొందింది. సుగ్రీవుడిని, మిగిలిన వానరములని కుశలమడిగింది. శోకముర్తి అయిన సీతమ్మ తల్లిని నా మాటల చేత ఊరడించాను, నా మాటల చేత ఊరడింపబడిన సీతమ్మ ఇవ్వాళ శోకమును వదిలిపెట్టి తన కోసం నువ్వు శోకిస్తున్నావని మాత్రమే శోకిస్తోంది " అని చెప్పాడు.  

అలా హనుమంతుడు తన వాక్ వైభవంతో సీత రాములని సంతోషపెట్టాడు.
                                                   
                                      సుందరకాండ   సమాప్తం 

Monday 28 May 2012

రామాయణం @ కధ -73



వెళ్ళిన మంత్రుల సుతులు చనిపోయారన్న వార్త రావణుడికి చేరింది, అప్పుడాయన 5 సేనాగ్ర నాయకులని పిలిచి " మీరు ఆ వానరాన్ని జాగ్రత్తగా పట్టండి, అది సామాన్యమైన వానరం కాదు. నేను ఎందరో మహర్షులను బాధ పెట్టాను, వాళ్ళందరూ తమ తపోశక్తులని ధారపోసి సృష్టించిన  మహా భూతం అయ్యి ఉంటుంది " అన్నాడు. విరూపాక్షయూపాక్షదుర్ధరప్రఘసభాసకర్ణ అనే 5 సేనా నాయకులు వెళ్ళి హనుమంతుడితో యుద్ధం మొదలుపెట్టారు. వాళ్ళల్లో దుర్ధరుడు వేసిన మూడు ఇనుప బాణములు హనుమంతుడి తలలో తగిలాయి. ఆగ్రహించిన హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి తన శరీరాన్ని పెంచాడు.


                             

ఆకాశంలోకి హనుమంతుడు ఎగిరాడని ఆ సేనా నాయకులు అలా చూశారు అంతే, ఆయన గబుక్కున ఆ  దుర్ధరుడి రథం మీద పడిపోయాడు. హనుమంతుడి శరీరం కింద  దుర్ధరుడు, ఆయన రథం, అన్నీ పచ్చడయిపోయి ఉన్నాయి. మిగిలిన వారిలో ఇద్దరు ఆయన వైపు పరుగులు తీసారు, అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద చెట్టుని పెకలించి దానితో ఆ ఇద్దరినీ కొట్టాడు. ఆ దెబ్బకి ఆ ఇద్దరూ మరణించారు. తరువాత మిగిలిన ఇద్దరినీ సంహరించాడు. 




ఈ వార్త విన్న రావణుడు సభలో అటూ ఇటూ తేరిపారి చూసి తన చిన్న కుమారుడైన  అక్ష కుమారుడి మీద ఆయన చూపులు ఆగాయి. తండ్రి తన వంక చూడగానే ఆ అక్ష కుమారుడు ప్రజ్వరిల్లుతున్న అగ్నిలా పైకి లేచి సంతోషంగా యుద్ధానికి వెళ్ళాడు. ఆ పిల్లవాడిని చూడగానే ' ఈ పిల్లవాడు ఎంత బావున్నాడు రా, చిన్నవాడే కాని చూస్తుంటే అగ్నిహోత్రంలా ఉన్నాడు. కాసేపు వీడిని యుద్ధం చెయ్యనిద్దాము' అని హనుమంతుడు అనుకున్నాడు. అక్ష కుమారుడు వేసిన బాణ పరంపర నుండి హనుమంతుడు సూక్ష్మ రూపంలో దొరకకుండా తిరుగుతున్నాడు. అక్ష కుమారుడు హనుమంతుడి శరీరంలో ఖాళీ లేకుండా బాణాలతో కొట్టేశాడు. అప్పుడు హనుమంతుడు ' దేవతలు కూడా వీడి యుద్ధాన్ని చూసి సంతోషిస్తారు, కాని ఇంట్లో అగ్ని ఉందని చూస్తూ ఊరుకుంటె ఇల్లు అంటుకుంటుంది. ఇక వీడిని చంపవలసిందే ' అనుకొని, ఆకాశంలోకి ఎగిరి శరీరాన్ని పెద్దద్ది చేసి కింద పడ్డాడు. అప్పుడు గుర్రాలురథంసారధి చనిపోయారు కాని అక్ష కుమారుడు మాత్రం ఎగిరి గాలిలోకి వెళ్ళిపోయి, ఆకాశం నుండి యుద్ధం చేశాడు. అప్పుడు హనుమంతుడు గాలిలోకి ఎగిరి ఆ అక్ష కుమారుడి పాదాలని పట్టుకొని వేగంగా కిందకి లాగి నేలకేసి బాదాడు. ఆ దెబ్బకి అక్షకుమారుడి కళ్ళు పేలిపోయి గుడ్లు ఎగిరిపోయాయి, తలకాయి వెయ్యి ముక్కలయ్యిందికడుపు బద్దలయిపోయి పేగులు బయటకి వచ్చాయి. 

తన చిన్న కుమారుడు మరణించాడన్న వార్త విన్న రావణుడికి జీవితంలో మొదటిసారి బాధ అంటె ఏంటో, భయం అంటె ఏంటో తెలిసొచ్చింది. అప్పుడాయనకి ఎవరిని పంపాలో అర్ధం కాక ఇంద్రజిత్ వంక చూసి " నిన్ను పంపకూడదు, కాని ఇవ్వాళ నిన్ను పంపక తప్పడం లేదు. చాలా జాగ్రత్తగా వెళ్ళు, లంకా పట్టణం భద్రత అంతా నీ చేతులలో ఉంది. ఒకసారి అస్త్రాలన్నిటిని మననం చేసుకుంటూ వెళ్ళు. ఎలాగైనా సరే ఆ వానర వీరుడి వేగం తగ్గించి పట్టుకొ, అవకాశం దొరికితే వాడిని సంహరించు " అని చెప్పి పంపాడు. ఇంద్రజిత్ రావణుడికి ప్రదక్షిణ చేసి బయలుదేరాడు.



ఇంద్రజిత్హనుమంతుడు ఒకరికి ఒకరు దొరకకుండా యుద్ధం చేసుకుంటున్నారు. ఈ వానరం యొక్క వేగాన్ని ముందు తగ్గించాలి, అనుకొని ఇంద్రజిత్ హనుమ మీదకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ సమయంలో హనుమంతుడికి పూర్వం బ్రహ్మగారు ఇచ్చిన వరం( ఏ అస్త్రము నిన్ను ఏమి చెయ్యలేదు) జ్ఞాపకం వచ్చి ' ఇది బ్రహ్మాస్త్రం, బ్రహ్మగారి పేరు మీద ఉన్న అస్త్రం, నేను దీనిని గౌరవించాలి. నేను ఆయనని తలుచుకొని నమస్కరించగానే ఇది నన్ను వదిలేస్తుంది. కాని నేను దీనికి కొంతసేపు కట్టుబడి ఉంటాను ' అనుకున్నాడు. బ్రహ్మాస్త్రానికి కట్టుబడడం వలన హనుమంతుడు నేల మీద పడిపోయాడు. ఈలోగా అక్కడున్న రాక్షసులు పరిగెత్తుకుంటూ వచ్చి కనపడ్డ గుడ్డ ముక్కలతో హనుమంతుడి కాళ్ళు, చేతులు కట్టేసికర్రలతో కొట్టారు. అప్పుడు హనుమంతుడు ' ఇలా ఈ రాక్షసులని ఎంతసేపు చంపుతాను, ఒకసారి రావణుడిని చూస్తాను ' అనుకొని అలా ఉండిపోయాడు.

కాని ఇంద్రజిత్ అనుకున్నాడు ' ఈ రాక్షసులు బుద్ధిహీనులు. బ్రహ్మాస్త్రంతో నేను కడితే వీళ్ళు వెళ్ళి తాడులతో కట్టారు. బ్రహ్మాస్త్రం చేత నిర్భంధింపబడ్డ వ్యక్తిని వేరొకదానితో కడితే ఆ బ్రహ్మాస్త్రం వదిలేస్తుంది. ఒకసారి బ్రహ్మాస్త్రం వెయ్యబడ్డ వ్యక్తి మీద ధనుర్వేదంలో ఉన్న ఏ అస్త్రం మళ్ళి సూర్యోదయం అయ్యేవరకు పనిచెయ్యదు. ఇప్పుడీయన తలచుకుంటె ఏమన్నా చెయ్యగలడు. కాని ఆ వానరానికి అస్త్రం వదిలేసిందన్న విషయం తెలీలేదు, వీళ్ళు కట్టేయడం వలన ఇంకా ఆ బ్రహ్మాస్త్రమే పట్టుకుని ఉందనుకుంటున్నాడు " అని అనుకొని సంతోషపడ్డాడు.



వాళ్ళు హనుమంతుడిని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి రావణుడి దెగ్గర నిలబెట్టారు. ఒక నల్లని మబ్బుని కాని, ఒక కాటుక కొండని కాని తీసుకొచ్చి సింహాసనం మీద పెడితే ఎలా ఉంటుందో, అలా రావణుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. రత్నములువజ్రములుస్ఫటికములు తాపడము చెయ్యబడ్డ ఒక పెద్ద ఉత్తమమైన వేదిక మీద కూర్చుని ఉన్నాడు. రావణుడికి వానరమైన హనుమంతుడితో మాట్లాడడం సిగ్గుగా అనిపించి తన మంత్రైన ప్రహస్తుడి వంక చూసి " ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందు కొచ్చాడు? ఎవరివాడు? నాకు ఇష్టమైన అశోక వనాన్ని ఎందుకు నాశనం చేశాడు? సీతతో ఎందుకు మాట్లాడాడు? ఏమి మాట్లాడాడు? ఈ విషయాలు మీరు ఆ వానరాన్ని అడిగి కనుక్కోండి. నిజం చెబితే వాడి ప్రాణాలు ఉంటాయి, అబద్ధం చెబితే ప్రాణాలు పోతాయి " అన్నాడు.

అప్పుడు ప్రహస్తుడు లేచి " నువ్వేమి భయపడకు. మా ప్రభువు ధర్మాత్ముడు. నిజం చెప్పు, నిన్ను పంపించేస్తాము. నిన్ను అగ్ని పంపించాడ? యముడు పంపించాడ? కుబేరుడు పంపించాడ? విష్ణువు పంపించాడ? ఎవరి ప్రమేయం వల్ల నువ్వు ఈ లంకా పట్టణానికి వచ్చావు? ఎందుకు అశోక వనాన్ని నాశనం చేశావు? " అని ప్రశ్నించాడు.

అప్పుడు హనుమ రావణుడి వంక చూసి " ఏమి కాంతిఏమి ద్యుతిఏమి పరాక్రమం, నిజంగా వీడి దెగ్గరే కాని మహా పతివ్రత అయిన స్త్రీని అపహరించి తెచ్చిన పాతకం (పాపం) లేకపోతె వీడు మూడు లోకములను శాసించగలిగినవాడు కదా " అన్నాడు.

హనుమని చూసిన రావణుడు భయపడి ' ఇది ఒక వానరుడికి ఉండవలసిన తేజస్సు కాదు, ఇంతకముందు నేను జాంబవంతుడినివాలినిసుగ్రీవుడినిసుషేణుడినినీలుడిని చూశాను, కాని వాళ్ళెవరికి ఇంత పరాక్రమముసామర్ధ్యం లేవు. బహుశా ఆనాడు నేను కైలాశ పర్వతాలని కదిపేస్తున్నప్పుడు నందీశ్వరుడు నన్ను శపించాడు, ' వానరులు నా కొంప ముంచుతాయని '. బహుశా నందీశ్వరుడే వచ్చాడేమో ' అనుకొన్నాడు.
 


అప్పుడు హనుమంతుడు అన్నాడు " నేను  రామ దూతగా ఇక్కడికి వచ్చాను. నా యదార్ధ స్వరూపము వానర స్వరూపమే. నన్ను హనుమ అంటారు, సుగ్రీవుడి సచివుడిని. కిష్కిందా రాజ్యాన్ని పరిపాలించే వాలి నీకు తెలుసు కదా, ఆ వాలిని ఒక బాణంతో రాముడు చంపి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. నీకు వాలికి ఉన్న స్నేహబంధం వల్ల సుగ్రీవుడు నీకు సోదరుడి వరస అవుతాడు, ఆ సుగ్రీవుడు నీ కుశలమడిగానని చెప్పమన్నాడు. నేను రాక్షసుడిని కాదు, రాముడిలా నరుడిని కాదు. నేను తటస్థమైన వాడిని, వానరుడిని. అందుకని నీ మంచి కోరి నాలుగు మంచి మాటలు చెబుతాను, విన్నావ బాగుపడతావు, లేకపోతె నాశనమయిపోతావు. నిన్ను చూడడానికి వేరొక ఉపాయము లేదు, అందుకని దండోపాయంతో అశోక వనాన్ని నాశనం చేశాను. అప్పుడు నీ వాళ్ళు నా మీదకి యుద్ధానికి వచ్చారు, దేహాన్ని రక్షించుకోవాలి కాబట్టి ఏదో నాలుగు గుద్దులు గుద్దాను, వాళ్ళు చనిపోయారు.

పూర్వకాలంలో కోసల రాజ్యాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు. ఆయన నలుగురు కుమారులలో పెద్దవాడైన రాముడు తండ్రి మాట నిలబెట్టడం కోసమని 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యడం కోసం లక్ష్మణుడు, సీతమ్మతో కలిసి దండకారణ్యానికి వచ్చాడు. రాముడి భార్య అయిన సీతమ్మని నువ్వు అపహరించి తీసుకొచ్చి లంకలొ పెట్టావు, సీతమ్మ ఎవరో నాకు తెలీదు, నేను చూడలేదు అని అబద్ధాలు చెప్పమాకు. నేను సీతమ్మని అశోకవనంలో చూశాను, నువ్వే సీతమ్మని అపహరించి తెచ్చావు. సీతమ్మ అయిదు తలల పాము, నీ మృత్యువుని నువ్వు తెచ్చుకున్నావు. రాముడి తేజస్సు ముందు నువ్వు నిలబడలేవు. నిన్ను చంపడానికి రాముడి దాకా ఎందుకు, సుగ్రీవుడు నిన్ను చంపేస్తాడు. రాముడికి సుగ్రీవుడికి అగ్ని సాక్షిగా స్నేహం ఉంది, కనుక రాముడి శత్రువు సుగ్రీవుడికి శత్రువే. నువ్వు ఆనాడు ' నర వానరములతో తప్ప ' అని బ్రహ్మగారిని వరం అడిగావు కదా, సుగ్రీవుడు గంధర్వుడు కాదు, కిన్నెరుడు కాదు, యక్షుడు కాదు, దేవత కాదు, రాక్షసుడు కాదు, ఆయన కేవలం వానరుడు. మనం చేసిన పుణ్యపాపాలకి సంబంధించిన ఫలితాలని పరమాత్మ ఏకకాలంలో ఇస్తాడు. నువ్వు చేసిన పుణ్యాలకి కాంచన లంకని పొందావు, వేల మంది కాంతలతో సుఖాలని అనుభవించావు, ఇంతమంది రాక్షసులకి ప్రభువుగా నిలబడ్డావు. కాని నువ్వు ఇవ్వాళ పరాయి స్త్రీని అపహరించి తీసుకొచ్చావు, ఆ పాపం వల్ల నువ్వు శరీరాన్ని వదిలిపెట్టబోతున్నావు. రాముడికి ధనుర్వేదంలో సమస్త అస్త్ర శస్త్రములు తెలుసు, ఋషుల దెగ్గర శిక్షణ పొందినవాడు, మహా ధర్మాత్ముడు, అటువంటి రాముడు లంకలో నిలబడి కోదండాన్ని పట్టుకొని బాణములు విడిచిపెడితే నువ్వు నిలబడలేవు. ఆ సమయంలో నీలాంటి రావణులు లక్ష మంది వచ్చినా రాముడి ముందు నిలబడలేరు.

ఒకనాడు నువ్వు కైలాస పర్వతాన్ని ఎత్తబోతుంటె, శివుడు తన కాలి బొటను వేలితొ ఆ పర్వతాన్ని తొక్కగా నీ 20 చేతులు ఆ పర్వతం కింద ఉండిపోయాయి. అటువంటి శివుడి ధనుస్సుని రాముడు హేలగా విరిచేశాడు. నిన్ను ముప్పతిప్పలు పెట్టిన వాలిని రాముడు ఒక్క బాణంతో కొట్టేశాడు. ఈ ప్రపంచంలో ఉన్న క్షత్రియులందరినీ ఓడించిన పరశురాముడికి గర్వభంగం చేశాడు. 14,000 మంది రాక్షసులని జనస్థానంలో రాముడొక్కడే సంహరించాడు. అటువంటి రాముడు వస్తే నువ్వు బతకగలవా. అయినా నిన్ను చంపడానికి రాముడు ఎందుకు, నేను చాలు. మర్యాదగా సీతమ్మని రాముడికి అప్పగిస్తే బతికిపోతావు, లేదా చచ్చిపోతావు " అన్నాడు.

ఒక నిండు సభలొ తనని హనుమంతుడు ఇంతలా అపేక్షించి మాట్లాడేసరికి రావణుడికి ఆగ్రహం వచ్చి " ఈ వానరాన్ని చంపెయ్యండి " అన్నాడు.
\

అప్పుడు విభీషణుడు లేచి " అన్నయ్య! నువ్వు వేదాలు చదువుకున్నావు, ధర్మాలు చదువుకున్నావు. ఇలా దూతని చంపమని నువ్వు అనడం సరికాదు. దూతకి వెయ్యబడే శిక్షలు కొన్ని ఉన్నాయి, అవి తల గొరిగించడంఅవయవాన్ని తీసెయ్యడంవాత పెట్టడం. అయినా ఈ వానరాన్ని చంపితే నీ బలం అవతలివారికి ఎలా తెలుస్తుంది. అందుకని వచ్చిన దూతని   చంపద్దు " అన్నాడు.

విభీషణుడి మాటలు విన్న రావణుడు " వానరాలకి తమ తోక అంటె చాలా ఇష్టం. అందుకని వీడి తోకకి నిప్పు పెట్టండికాలిపోయిన తోకతో ఈ వానరం తనని పంపినవారి దెగ్గరికి వెళుతుంది, అప్పుడు ఈ వానరం యొక్క మిత్రులు, బంధువులు చుట్టూ చేరి ' తోకలేని కోతితోకలేని కోతి ' అని ఏడిపిస్తారు " అన్నాడు.



అప్పుడు వాళ్ళు పాత  బట్టలు పట్టుకొచ్చి హనుమ తోకకి చుట్టి, నెయ్యి పోసి మంట వెలిగించారు. హనుమంతుడిని కట్టేసి, రథం ఎక్కించి నాలుగు కూడళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళి కర్రలతో కొడుతూ ' గూఢచారి, గూఢచారి ' అని ప్రకటించారు. ఆ లంకా పట్టణంలో మేడల మీద మిద్దెల మీద అందరూ నిలబడి చూస్తున్నారు.

అప్పుడు హనుమంతుడు ' వీళ్ళు నన్ను కొడితే కొట్టారులే కాని, రాత్రి వేళలొ ఈ లంకా పట్టణాన్ని అన్వేషించాను. ఒకసారి పగటిపూట రావణుడి బలం ఏమిటో, లంక యొక్క గొప్పతనం ఏమిటో చూసి సుగ్రీవుడికి చెబుతాను ' అనుకున్నాడు.





వాళ్ళు హనుమని ఆ లంకా పట్టణం అంతా తిప్పాక ఆయన ఒక్కసారి కట్లని విడిపించుకొని ఎగిరి రాజద్వారం మీదకి దూకి తన చేతితో మండుతున్న తోకని పట్టుకున్నాడు.