Pages

Thursday 29 March 2012

కల్యాణ రాముని అవతార కథ



కల్యాణ రాముని అవతార కథ
భగవంతుడు ధరించిన మానవ అవతారములలో యీ శ్రీరామచంద్రమూర్తి అవతారము సంపూర్ణ మానవావతారమని రామాయణ కావ్యము (ఆది కావ్యం) తెల్పుతున్నది. శ్రీ రామ నవమి పండుగను రాముల వారి జన్మదినంగాను, సీతా మాత తో కళ్యాణ మహోత్సవంగాను జరుపుకుంటారు. హిందూ మతానుయాయుల ఆరాధ్య దైవం ఆ శ్రీ రామచంద్ర మూర్తి.
భగవంతుడు తన భక్తుల కోర్కెలను తీర్చుటకును, దుష్టుల సంహరించుటకును, సజ్జనుల కష్టముల నుండి కడతేర్చుటకును ఆయా సందర్భాను సారముగ అవతారముల నెత్తును. భారత ఇతి హాసముల ద్వారా పురాణముల ద్వారా కావ్యముల ద్వారా మనకు భగవంతుని అవతారముల గురించి తెలియుచున్నది.

పూర్వము వాల్మీకి యను మహర్షి శ్రీ మద్రామాయణము అను మహా కావ్యము వ్రాసెను. భారతీయులకు వాల్మీకి మొదటి కావ్యరచయిత; శ్రీ మద్రామాయణమే మొదటి కావ్యము . ఈ కావ్యము నుండి భగవంతుని దశావతారములు లోని రామావతారము గురించి మనకు తెలియుచున్నది.

భగవంతుడు ధరించిన మానవ అవతారములలో యీ శ్రీరామచంద్రమూర్తి అవతారము సంపూర్ణ మానవావతారమని రామాయణ కావ్యము తెల్పుతున్నది.ఈ రామున్ని అవతారాన్ని విష్ణు మూర్తి యొక్క ఏడవ  అవతారం అని చెపవచ్చు. శ్రీరామునిగా మానవావతారమెత్తిన భగవంతుడు మానవుడు ఎలా వుండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏఏ ధర్మాలను పాటించాలి అనే విషయాలను తను ఆచరించి మానవులకు చూపి, ఆదర్శమూర్తి అయి, ఇప్పటికిని అనగా త్రేతాయుగములో అవతరించి, ద్వాపరము అయి కలియుగము నడుస్తున్న ఈ నాటికి కూడా దేవునిగా కొనియాడబడుతూ శ్రీ రామ నవమి అను పేరున నవరాత్రములు, కళ్యాణ మహోత్సవములు జరిపించుకొనుచున్నాడు.

జన్మ వృత్తాంతం


త్రేతా యుగమున రావణాసురుడు యను రాక్షసుడు భూలోకమున లంకాధీశుడై పరమశివుడు, బ్రహ్మలగురించి తపస్సు చేసి వారిచే అనుగ్రహింపబడిన వర గర్వితుడై ఎవ్వరిని లెక్క చేయక దేవతలను, ఋషులను, హరి (విష్టువు) భక్తులను వేధించుచుండెను. అప్పుడు వారందరు హరిని ప్రార్ధించి తమ కష్టములను మొర పెట్టుకొనగా, ఆ మహా విష్ణువు రామునిగా అవతరించి రావణుని కడతేర్చెద నని వారికి చెప్పి, వారిని శాంతపరచి పంపెను.




భూలోకమున అయోధ్యా నగర చక్రవర్తి దశరధుడు పుత్రుల కొరకై పుత్ర కామేష్టి యను యఙ్ఞమును చేయుచుండెను. ఆ యఙ్ఞమునకు సంతసించిన దేవతలు అగ్ని దేవుని ద్వారా దశరధునికి పాయసము ను పంపిరి. ఆ పాయసమును దశరధుడు తన ముగ్గురు భార్యలకు అనగా కౌసల్య, సుమిత్ర,కైకేయి లకు పంచెను. కొన్నాళ్లకు యీ ముగ్గురు భార్యలు గర్భవతులై నలుగురు మగబిడ్డలను ప్రసవించారు. ఆ మహా విష్ణువే తన ఆది శేషువు, శంఖ చక్రములు, గదలతో సహా యీ నలుగురు పుత్రులుగా అవతిరించెను. రావణ సంహారము కొరకు అవతరించిన ఆనలుగురు పుత్రులే శ్రీరామ చంద్రమూర్తి, లక్ష్మణుడు, భరతుడు మరియు శతృఘ్నుడు.
చైత్ర మాసమున, శుద్ధ నవమీ తిధినాడు, పునర్వసు నక్షత్రమున ఐదు గ్రహములు ఉచ్ఛంలో నుండగ కర్కాటక లగ్నమున గురుడు చంద్రునితో కలసి వుండగా, జగన్నాధుడు, సర్వలోకారాధ్యుడు , సర్వ లక్షణ సంయుతుడును అగు ఆ మహా విష్ణువు కౌసల్యాదేవి గర్భమున శ్రీరామ చంద్రమూర్తిగా జనియించెను. శ్రీరాముడు పూర్ణ మానవుడుగా జీవించెను.అదే సమయమున కైకేయి భరతునికి, సుమిత్ర లక్ష్మణ, స్రత్రుజ్నులు జన్మించిరి.

రామ నవమి


విష్ణు  మూర్తి భార్య అయిన లక్ష్మిదేవి  జనక మహారాజు అయిన మిధాల నగరానికి రాజుకు అయోనిజగా , భుజాతిగా లబించెను .ఆమెకు సీతా అని నమకరం చేసితిరి.జనకుని కుమార్తె కనుక జానకి అని,అలాగే ఏ వీరుడైన తనని భార్యగా పొదలి అనుకునే వాడు  కనుక ఆమెను వీర్య సుల్క గాను పిలిచేవారు.జనకమహారాజు దగ్గర హరిహరులు మాత్రమే మోయగల శివధనుస్సు ఉండేది. ఒకానొక రోజు సీతాదేవి ఆడుకుంటూ పూజ మందిరం లో ఉనటువంటి శివధనుస్సు ను అవలీలగా జరుపగా జనకమహారాజు ఈ శివధనస్సు ని ఎకుపెట్టిన వారికే సీతను ఇచ్చి వివాహం జరిపించేదను అని స్వయంవరం ప్రకటించెను. అపుడే రాక్షస సంహారం చేసి వశిష్టుల వారితో కలసి మిధుల నగరానికి వచ్చెను.  అక్కడ శివదనస్సు ను  ఎతట్టం,సీత దేవితో వివాహం జరిగెను.శ్రీ రాముని జననమైన ఆ నవమి తిధి నాడే ఆయన వివాహము జరిగెను. రావణ  సంహారం అయిన తరువాత రాజ్య పట్టాభిషేకము కూడ నవమి జరిగెను. అందుకనే శ్రీరామ నవమి అని చైత్ర శుద్ధ నవమి నాడే మనము పండుగ జరుపుకుంటాము.


విద్ధి విద్ధానం


ఆ రోజు మానవులందరూ తల స్నానము చేసి శుభ్రమైన లేక క్రొత్త బట్టలను ధరించి సీతారాముల పూజించి, కళ్యాణ మహోత్సవను జరిపించి, వసంత ఋతువు - ఎండాకాలము అగుటవలన పానకము, వడపప్పు ఆరగింపు చేసి ప్రసాదము పంచుదురు. దశమి నాడు పట్టాభిషేక ఘట్టము జరుపుదురు. కొందరు చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు రామనవరాత్రోత్సవము జరుపుదురు. ఈ తొమ్మిది దినములందు రామాయణ పారాయణము, రాత్రులందు రామకధా కాలక్షేపము జరుపుదురు.

శ్రీ రామనవమి నుండి రామకోటి వ్రాయుట నారంభించి, మరుసటి శ్రీ రామనవమికి ఆ వ్రతము ముగించు ఆచారము కూడ కలదు. శ్రీ రామ నామము లక్ష, కోటి వ్రాసిన ఒక్కోక్క అక్షరమే మహా పాతకములను నశింపజేయునని శంకరుడు పార్వతికి చెప్పునట్లు భవిష్య ఉత్తర పురాణమున ఉమామహేశ్వర సంవాదమున వివరింపబడినది.

దేవుడైనను, మానవ రూపమున నున్న కారణమున ఆ శ్రీ సీతారాముడు, మానవుడు తన దుఃఖములలో , కష్ట నష్టములలో ఏ విధంగా స్పందించునో ఆ విధముగనే ప్రవర్తించి చూపుటయే గాక పితృవాక్య పరిపాలనము, సత్యసంధత, భ్రాతృప్రీతి, స్నేహ బంధము, ఏక పత్నీ వ్రతము, ఒకే మాట - ఒకే బాణము , మొదలగు కష్టతరమైన ధర్మాలను ఆచరించి చూపి తన శీల సంపదతో మానవ జాతికే కనువిప్పు కలిగించెను.

అందుకనే "శ్రీ సీతారాముల గుడి లేని గ్రామముండదు...ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు శ్రీరామున్ని పందిరి లేని వీడి ఉండదు.  శ్రీ రామ అని మొట్ట మొదట వ్రాయక, యే వ్రాతయూ వ్రాయబడదు" అను నానుడి వచ్చినది. ఆ విధంగా శ్రీ రామ నవమి మానవాళికి పర్వదినమైనది.

Tuesday 27 March 2012

రామాయణం @ కధ -23



ఆ రోజున గుర్రాలు సేద తీరాక, ఆ ఇంగుదీ వృక్షం కింద సీతారాములు పడుకున్నారు. అప్పుడు గుహుడు లక్ష్మణుడిని కూడా పడుకోమనగా....

కథం దాశరథౌ భూమౌ శయానే సహ సీతయా |
శక్యా నిద్రా మయా లబ్ధుం జీవితం వా సుఖాని వా ||
యో న దేవ అసురైః సర్వైః శక్యః ప్రసహితుం యుధి |
తం పశ్య సుఖ సంవిష్టం తృణేషు సహ సీతయా ||

" నాకు నిద్ర వస్తుందని ఎలా అనుకున్నావు, రాముడు నేల మీద పడుకొని ఉండగా నా జీవితానికి ఇక సుఖం లేదు. దేవతలు, రాక్షసులు కలిసి యుద్ధానికి వస్తే, వాళ్ళని నిగ్రహించగల మొనగాడు మా అన్నగారు, అలాంటి మా అన్నయ్య, సీతమ్మతో కలిసి ఇలా పడుకొని ఉంటె నేనెలా పడుకోగలను " అన్నాడు లక్ష్మణుడు. 


మరునాడు ఉదయం గుహుడు తీసుకొచ్చిన పడవ ఎక్కి సీతారామలక్ష్మణులు గంగని దాటడానికి సిద్ధపడుతున్నారు. అప్పుడు సుమంత్రుడు రాముడిని పిలిచి, ' నేను ఏమి చెయ్యను ' అని అడుగగా, రాముడు ఇలా అన్నాడు " నువ్వు తిరిగి అయోధ్యకి వెళ్ళి మా తండ్రిగారికి, ముగ్గురు తల్లులకి నా నమస్కారములు చెప్పు, కౌసల్యని సర్వకాలములయందు దశరథుడిని సేవించమని చెప్పు. భరతుడిని కుశలమడిగానని చెప్పు, వృద్ధుడైన చక్రవర్తిని ఏ ఒక్క కారణం చేత బాధ పెట్టవద్దని చెప్పు, తండ్రి మనస్సుకి అనుగుణంగా పరిపాలించమని చెప్పు " అన్నాడు. 


అప్పుడు సుమంత్రుడు " రామా! నేను మీతోనే వస్తాను, మీ సేవ చేసుకుంటాను, ఏ రథం మీద మిమ్మల్ని అరణ్యాలకి తీసుకువచ్చానో, ఆ రథం మీదే మిమ్మల్ని 14 సంవత్సరాల తరువాత అయోధ్యకి తీసుకువెళతాను " అన్నాడు. 


" నువ్వు నాతో వచేస్తే కైకమ్మకి అనుమానం వస్తుంది. రాముడు అరణ్యవాసం చెయ్యకుండా రథం మీద తిరుగుతున్నాడనుకుంటుంది. అందుకని నువ్వు ఖాళీ రథంతో వెనక్కి వెళ్ళి, రాముడు గంగని దాటి అరణ్యాలకి వెళ్ళాడని చెప్పాలి, అప్పుడు ఆమె సంతోషిస్తుంది. అందుకని నువ్వు బయలుదేరాలి " అన్నాడు. వెంటనే సుమంత్రుడు అయోధ్యకి బయలుదేరాడు.


తత్ క్షీరం రాజ పుత్రాయ గుహః క్షిప్రం ఉపాహరత్ |
లక్ష్మణస్య ఆత్మనః చైవ రామః తేన అకరోజ్ జటాః ||



అప్పుడు రాముడు గుహుడిని పిలిచి " గుహా! ఇకనుంచి నేను ఒక తపస్వి ఎలా బతుకుతాడో అలా బతకాలి. అందుకని నువ్వు నాకోసం మర్రి పాలు తీసుకురా " అన్నాడు. అప్పుడు రాముడు గుహుడిని ఆ మర్రిపాలని తన తల మీద, లక్ష్మణుడి తల మీద పొయ్యమన్నాడు. మర్రిపాలు పోశాక జిగురుతో ఉన్న ఆ జుట్టుని జటల కింద కట్టేసుకున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ రాముడి యొక్క ధర్మనిష్ఠకి ఆశ్చర్యపోయారు. అప్పుడు రాముడు " నేను ఈ 14 సంవత్సరాలు నా క్షాత్ర ధర్మాన్ని పాటిస్తూ, బ్రహ్మచర్యంతో కూడిన అరణ్యవాసాన్ని చేస్తాను " అన్నాడు. 



తరువాత రాముడు లక్ష్మణుడిని పిలిచి " ముందు మీ వదినని పడవ ఎక్కించి నువ్వు ఎక్కు " అని చెప్పి, వాళ్ళు పడవ ఎక్కాక ఆయన కూడా పడవ ఎక్కాడు. అలా సీతారామలక్ష్మణులు గంగని దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళారు. అక్కడినుంచి అలా కొంత దూరం వెళ్ళాక చీకటి పడేసరికి వాళ్ళందరూ ఒక చెట్టు కింద విడిది చేశారు. అప్పుడు రామలక్ష్మణులు వెళ్ళి మూడు మృగాలని సంహరించి, వాటిని తీసుకొచ్చి అగ్నిలో బాగా కాల్చి, ఆ మాంసాన్ని ముగ్గురూ తిన్నారు. తరువాత అక్కడే పడి ఉన్న ఎండుటాకులమీద పడుకున్నారు.  


అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి " లక్ష్మణా! నాకు ఒక ఆలోచన వచ్చింది. భరతుడు యువరాజ పట్టాభిషేకం చేసుకున్నాక కౌసల్యని, సుమిత్రని బంధిస్తాడు. అందుకని నువ్వు బయలుదేరి అయోధ్యకి వెళ్ళిపో " అన్నాడు. 


రాముడి మాటలు విన్న లక్ష్మణుడు ఇలా చెప్పాడు " అన్నయ్యా తప్పకుండా వెళ్ళిపోతాను, కాని ఈ మాట నాకు చెప్పినట్టు, నిద్రపోతున్న సీతమ్మకి కూడా చెప్పవే. సీతమ్మ నిన్ను విడిచిపెట్టి ఉండలేదు కనుక, ఆ విషయం నీకు తెలుసు కనుక సీతమ్మని వెనక్కి వెళ్ళి కౌసల్య , సుమిత్ర , దశరథుల సేవ చెయ్యమని నువ్వు ఆజ్ఞాపించవు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళి నేను ఉండగలనని అనుకుంటున్నావు, అందుకు నన్ను వెళ్ళిపోమంటున్నావు. 


న చ సీతా త్వయా హీనా న చ అహం అపి రాఘవ |
ముహూర్తం అపి జీవావో జలాన్ మత్స్యావ్ ఇవ ఉద్ధృతౌ ||



నీటిలో ఉన్న చేప పిల్లని పైకి తీసి ఒడ్డున పారేస్తే, తన ఒంటికి తడి  ఉన్నంతవరకు ప్రాణములతో ఉండి, ఆ ఒంటి తడి ఆరిపోగానే ఎలా ప్రాణములని వదులుతుందో, అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ, నిన్ను చూస్తూ, నువ్వు ఎంతసేపు కనపడతావో అంతసేపు ప్రాణములతో ఉండి, నువ్వు కనబడడం మానెయ్యగానే ఈ ప్రాణములను విదిచిపెట్టేస్తాను అన్నయ్యా " అన్నాడు. 




" లక్ష్మణా! 14 సంవత్సరాల అరణ్యవాసంలో మళ్ళి నిన్ను ఈ మాట అడగను, నువ్వు నాతోనే ఉండు " అని రాముడు లక్ష్మణుడితో అన్నాడు. 


మరునాడు ఉదయం కొంతదూరం ప్రయాణించగా వాళ్ళకి అక్కడ ఒక ఆశ్రమం కనబడింది. అది భారద్వాజ ముని ఆశ్రమం. ఆ ఆశ్రమంలో భారద్వాజుడు శిష్యులకు వేద పాఠాలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఆయన త్రికాలవేది. రాముడు ఆశ్రమంలోనికి ప్రవేశించి, తనని తాను పరిచయం చేసుకోని, తరువాత తన పత్నిని, సోదరుడిని పరిచయం చేసి, భారద్వాజునికి నమస్కారం చేసి, కుశల ప్రశ్నలు అడిగాడు. ఆ రాత్రి ఆశ్రమంలో గడిపాక, మరునాడు ఉదయం భారద్వాజుడు రాముడిని 14 సంవత్సరాల అరణ్యవాసాన్ని తన ఆశ్రమంలోనే గడపమన్నాడు. 



అప్పుడు రాముడు " మీ ఆశ్రమం మా రాజ్యానికి దెగ్గరలోనే ఉంది, తాను ఇక్కడే ఉంటె జానపదులు తనని చూడడానికి వస్తుంటారు, నేను రాజ్యానికి దెగ్గరలోనే ఉండిపోయానని కైకమ్మకి ఇబ్బందిగా ఉంటుంది, అందుకని నిర్జనమై, ఎవ్వరూలేని చోటుకి వెళ్ళిపోతాను. కావున క్రూరమృగముల వల్ల, రాక్షసుల వల్ల ప్రమాదం లేనటువంటి ఒక యోగ్యమైన ప్రదేశాన్ని మీరు నిర్ణయిస్తే, మేము అక్కడ పర్ణశాల నిర్మించు కుంటాము " అన్నాడు. 


భారద్వాజుడు ఇలా అన్నాడు " ఇక్కడినుంచి బయలుదేరి యమునా నదిని దాటండి, దాటాక కొంచెం ముందుకి వెళితే మీకు ఒక గొప్ప మర్రి చెట్టు కనపడుతుంది, ఆ చెట్టుకి ఒకసారి నమస్కారం చేసి ముందుకి వెళితే నీలము అనే వనం కనపడుతుంది, ఆ వనంలో మోదుగ చెట్లు, రేగు చెట్లు ఎక్కువగా ఉంటాయి. అలా ఇంకొంచెం ముందుకి వెళితే ఎక్కడ చూసినా నీళ్ళు, చెట్లు కనబడతాయి, అక్కడనుంచి చూస్తే చిత్రకూట పర్వతాల శిఖరాలు కనపడతాయి. మీరందరూ ఆ చిత్రకూట పర్వతాల్ని చెరుకోండి, అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమానికి పక్కన మీకు అనువైన స్థలంలో ఆశ్రమాన్ని నిర్మించుకోండి. ఆ ప్రదేశంలో ఏనుగులు, కొండముచ్చులు, కోతులు, బంగారు చుక్కలు గల జింకలు తిరుగుతూ ఉంటాయి. అక్కడ మీకు కావలసిన ఆహారం దొరుకుతుంది. స్వచ్ఛమైన జలాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ అరణ్యాలకి నేను చాలా సార్లు వెళ్ళాను, అక్కడ కార్చిచ్చు పుట్టదు. కాబట్టి మీరు అక్కడ పర్ణశాల నిర్మించుకోండి " అని అన్నాడు.  




భారద్వాజుడు చెప్పిన ప్రకారం పర్ణశాల నిర్మించుకోడానికి సీతారామలక్ష్మణులు ఆయనకి నమస్కారం చేసి బయలుదేరి చిత్రకూట పర్వతాన్ని చేరుకున్నారు. లక్ష్మణుడు చక్కటి పర్ణశాలని నిర్మించాడు. ఆ పర్ణశాలలో వాస్తు హొమం చేసి గృహప్రవేశం చేశారు. తరువాత వాల్మీకి ఆశ్రమాన్ని సందర్శించారు. వాళ్ళ రాకతో వాల్మీకి మహర్షి చాలా సంతోషించారు.

అలా ఆ చిత్రకూట పర్వతాలమీద సీతరామలక్ష్మణులు హాయిగా కాలం గడపసాగారు.

రామాయణం @ కధ -22


న అతంత్రీ వాద్యతే వీణా న అచక్రః వర్తతే రథః |
న అపతిః సుఖం ఏధతే యా స్యాత్ అపి శత ఆత్మజా || 



వీణలొ ఉండే తీగలు లేకపోతే అసలు వీణే లేదు, చక్రం లేకపోతే అసలు రథమే లేదు, నూరుగురు కుమారులు ఇచ్చే సుఖం కన్నా, భార్య భర్త దెగ్గర పొందే సుఖం ముందు ఈ సుఖాలు సరిపోవు " అనింది.

తరువాత లక్ష్మణుడు సుమిత్రకి ప్రదక్షిణ చేసి నమస్కారం చెయ్యగా, ఆవిడ ఇలా అనింది " నువ్వు అరణ్యవాసానికే జన్మించావు. లక్ష్మణా, రాముడిని ప్రేమించేవాళ్ళు ఇంత మంది ఉన్నా, తమ తమ సంసారాలని వదిలి ఎవరూ రాలేదు. రాముడి కైంకర్యం చేసుకునే అదృష్టం నీకే దక్కింది. నువ్వు ఏమరపాటు లేకుండా సర్వకాలములయందు సీతారాములని రక్షిస్తూ ఉండు. 

రామం దశరథం విద్ధి మాం విద్ధి జనక ఆత్మజాం |
అయోధ్యాం అటవీం విద్ధి గచ్చ తాత యథా సుఖం ||


లక్ష్మణా! నువ్వు రాముడిని నీ తండ్రి అనుకో, సీతమ్మని నీ తల్లి అనుకో, వాళ్ళిద్దరూ ఉన్న అడవి అయోధ్య అనుకొని సుఖంగా వెళ్ళిపో  " అనింది. 

రాముడు సీతమ్మతో, లక్ష్మణుడితో కలిసి ఆ రథాన్ని ఎక్కాడు. రాముడు వెళ్ళిపోతున్నాడని ఆ అయోధ్యా నగర వాసులందరూ ఏడుస్తున్నారు. యజ్ఞాలు చేస్తున్న వాళ్ళు ఆ యజ్ఞాన్ని మధ్యలోనే ఆపి వచ్చేసారు. ఆడవారు, పిలలు, వృద్ధులు ' రామా! రామా! ' అంటూ అరుస్తూ బాధపడుతున్నారు. ఏడుస్తున్న తమ పిల్లలకి పక్షులు ఆహారం తేవడం మరిచి, తమ గూళ్ళల్లో కన్నుల నీరు కారుస్తూ నిలబడ్డాయి. ఆశ్వశాలలోని గుర్రాలు, గజశాలలోని ఏనుగులు కన్నులెమ్మట వేడి నీరు కారుతుండగా, సకిలిస్తూ, గర్జన చేస్తూ అటూ ఇటూ ఉన్మాదంతో తిరిగాయి. సమస్త భూతములు ఒకరకమైన సంక్షోభానికి గురయ్యాయి. అలా ఆ రథం వెళుతుండగా, వెనకనుంచి కౌసల్యా దేవి గాలిలోకి చేతులూపుతూ, పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ, తన పవిటకొంగు జారిపోయినా పట్టించుకోకుండా, ఆమెని ఆపుదామని వచ్చిన వారిని తోసేస్తూ, ఆ రథం వెనుక పరుగుతీసింది. మరొకపక్క దశరథుడు ఆగు ఆగు అంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. తన తల్లిదండ్రులని అలా చూడలేక, రథం నడుపుతున్న సుమంత్రుడిని రాముడు తొందరగా నడపమన్నాడు. 

" నేను చక్రవర్తిని ఆజ్ఞాపిస్తున్నాను, సుమంత్రా ఆపు, ఆ రథం నడపకు " అన్నాడు దశరథుడు. రెండు చక్రముల మధ్యలో పడ్డ ప్రాణి పరిస్తితి ఎలా ఉంటుందో, సుమంత్రుడి పరిస్తితి కూడా అలానే ఉంది.

అప్పుడు రాముడు " సుమంత్రా! రేపు పొద్దున్న నువ్వు తిరిగొచ్చాక, రథం ఎందుకు ఆపలేదని దశరథుడు అడిగితే, నాకు చక్రాల సవ్వడిలో మీ మాటలు వినపడలేదని చెప్పు. కావున రథాన్ని కదుపు " అన్నాడు. అలా ఆ రథం ముందుకి సాగిపోయింది. 




మనమందరమూ రాముడి వెనకాలే వెళదాము, ఆయనతోనే ఉందాము, మనతోపాటు పిల్లలని, వృద్ధులని, మన ఆవులనీ తీసుకొని వెళదాము. మనమందరమూ వెళ్ళిపోయాక దశరథుడు కూడా వచ్చేస్తాడు, అలాగే ఆయన పత్నులు కూడా వస్తారు, తరువాత చతురంగ బలాలు కూడా వస్తాయి. మనమందరమూ అడవులకి వెళితే, అడవి అయోధ్య అవుతుంది. మనందరినీ చూసి బెదిరిన జంతువులు అయోధ్యకి వస్తాయి. అప్పుడు కైకమ్మ తన కుమారుడితో ఈ క్రూరమృగాలని పరిపాలించుకుంటుంది అని అందరూ రాముడి వెంట బయలుదేరారు. కాని, రాముడి రథం యొక్క వేగాన్ని అందుకోలేక చాలా మంది వెనుదిరిగారు. తన వెనుక వృద్ధులైన బ్రాహ్మణులు పరుగులు తీస్తూ వస్తున్నారని తెలుసుకొని, రాముడు ఆ రథం నుండి దిగి, వాళ్ళతోపాటు నడవడం ప్రారంభించాడు. అలా అందరూ వెళుతూ వెళుతూ తమసా నదీ తీరాన్ని చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. అందరూ అంత దూరం నడిచి రావడం వల్ల ఆదమరిచి నిద్రపోయారు. 


రాముడు వెళ్ళినతరువాత స్పృహకోల్పోయిన దశరథుడు మెల్లగా తేరుకున్నాడు. సేవకులని పిలిచి తనని కౌసల్యా మందిరానికి తీసుకెళ్ళమన్నాడు. సకల గుణములు కలిగిన కౌసల్య ఉండగా కామ మొహంతో కైకేయని తెచ్చుకున్నాను, ఇవ్వాళ ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాను అని ఏడ్చి ఏడ్చి ఏడిచేసరికి ఆయన కన్నులు కనపడడం మానేసాయి. అప్పుడాయన కౌసల్యతో ఇలా అన్నాడు " ఇక నేను ఎంతో సేపు బతకను, నేను చనిపోయేలోపల రాముడు ఎలాగు నన్ను ముట్టుకొలేడు, రాముడితో పాటే నా చూపు వెళ్ళిపోయింది, అందుకని రాముడి తల్లివైన నువ్వు నన్ను ఒకసారి ముట్టుకో, నువ్వు ముట్టుకుంటే రాముడు ముట్టుకున్నట్టు ఉంటుందేమో, ఒకసారి నన్ను ముట్టుకోవా కౌసల్యా " అన్నాడు. 


" అవునులే, కన్న కొడుకుని అరణ్యాలకి పంపించావు, ఇవ్వాళ నన్ను ఇలాంటి దౌర్భాగ్యస్థితిలో పడేశావు, నీ వల్ల దేశం అంతా బాధపడుతోంది, ఇప్పటికైనా నీకు సంతోషంగా ఉందా రాజా " అని కౌసల్య అనింది.


అప్పుడు దశరథుడు " పడిపోయిన గుర్రాన్ని ఎందుకు పొడుస్తావు కౌసల్య, నీ దెగ్గర ఉపశాంతి పొందుదామని వచ్చాను. నువ్వు కూడా ఇంత మాట అన్నావ కౌసల్య " అని మళ్ళి మూర్చపోయాడు. 


అటుపక్క తెలవరుతుండగా రాముడు సుమంత్రుడిని పిలిచి " వీళ్ళందరూ వృద్ధులైన బ్రాహ్మణులు, నా మీద ఉన్న ప్రేమతో నా వెనకాల వచ్చారు. వీళ్ళు నాతో 14 సంవత్సరాలు వస్తే బాధ పడతారు. అందుచేత నేను కనపడక పోతే వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉండగానే మనం వెళ్లిపోవాలి. కాని, వీళ్ళు వెనక్కి వెళ్ళకుండా, రాముడు ఎటు వెళ్ళాడో గుర్తుపడదామని రథ చక్రాల వెనక వస్తారు. అందుకని రథాన్ని ముందు ఉత్తర దిక్కుకి పోనివ్వు, ఉత్తర దిక్కున అయోధ్య ఉంది, అలా కొంతదూరం పోనిచ్చాక, రథాన్ని వెనక్కి తిప్పి గడ్డిమీద, పొదల మీద నుంచి పోనిచ్చి తమసా నదిని దాటించు. అప్పుడు వాళ్ళకి ఆ రథచక్రాల గుర్తులు కనపడకపోయేసరికి వాళ్ళందరూ అయోధ్యకి వెళతారు " అన్నాడు. 


అలా తెల్లవారగానే నిశబ్దంగా ఉత్తర దిక్కుకి రథాన్ని పోనిచ్చి, మళ్ళి అదే గాడిలో వెనక్కి వచ్చి, తమసా నదిని దాటి ఆవలి వడ్డుకి చేరుకున్నారు. తెలవారగానే బ్రాహ్మణులందరూ నిద్ర లేచి " ఏడి రాముడు ఏడి రాముడు " అని, రాముడి రథచక్రాల గాడిని బట్టి వెళదామని అందరూ బయలుదేరారు. కొంతదూరం వెళ్ళాక రథ చక్రాలు ఆగిపోయాయి. ఇంక చేసేది ఏమి లేక బాధపడుతూ అయోధ్యకి వెళ్ళారు. రాముడు వెళ్లిపోయాడని ఆ అయోధ్యా పట్టణంలో అన్నం వండుకున్నవాడు ఒక్కడు కూడా లేడు. ఏ ఇంటిముందు కూడా కళ్ళాపి జల్లలేదు. ఎవరూ ముగ్గు పెట్టలేదు. ఆ రాజ్యంలోని ఏ ఒక్క ప్రాణి కూడా ఆనందంగా లేదు. ఆ రాజ్యంలో సంతోషంగా ఉన్న ఏకైక ప్రాణి కైకేయ. 


రాముడు ఆ తమసా నదిని దాటాక, ఒక్కక్కరోజు వేదశృతిగోమతి మొదలైన నగరాలని దాటి, కోసలరాజ్య సరిహద్దుకి చేరుకున్నారు. అక్కడికి వచ్చాక ఆ అయోధ్యా నగరానికి రథం దిగి ఒకసారి నమస్కారం చేసి ఇలా అన్నాడు....


ఆపృచ్ఛే త్వాం పురీశ్రేష్ఠే కాకుత్స్థపరిపాలితే |
దైవతాని చ యాని త్వాం పాలయంత్యావసంతి చ |



" ఓ అయోధ్యా! పూర్వం మా కాకుత్స వంశంలోని ఎందరో రాజులు నిన్ను పరిపాలించారు. ఇటువంటి అయోధ్యా నగరాన్ని విడిచి, ధర్మానికి కట్టుబడి 14 సంవత్సరాలు అరణ్యాలకి వెళుతున్నాను. తిరిగి నేను ఈ అయోధ్య నగరంలో ప్రవేశించి, మా తల్లిదండ్రుల పాదములకు నమస్కరించే అదృష్టాన్ని నాకు ప్రసాదించు" అని వేడుకున్నాడు.


తరువాత వాళ్ళు ఆ కోసల దేశ సరిహద్దుల్ని దాటి గంగా నదీ తీరాన్ని చేరుకున్నారు. అక్కడ ఒక ఇంగుదీ(గారవృక్షం యొక్క నీడలో అందరూ కూర్చున్నారు.


తత్ర రాజా గుహో నామ రామస్య ఆత్మ సమః సఖా |
నిషాద జాత్యో బలవాన్ స్థపతిః చ ఇతి విశ్రుతః ||



రాముడు అక్కడికి వచ్చాడని తెలుసుకొని ఆ ప్రాంతంలో( ఆ ప్రాంతాన్ని శృంగిబేరపురము అని పిలుస్తారు, ఆ ప్రాంతానికి నిషాదుడైన గుహుడు అధిపతి) ఉంటున్న, రాముడికి ఆత్మతో సమానమైన స్నేహితుడైన( తమ ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ రాముడికి ఆత్మతో సమానమైన స్నేహితులే)గుహుడు పరుగు పరుగున వచ్చి, రాముడిని గట్టిగా కౌగలించుకొని ఇలా అన్నాడు...... 

" రామా! ఇది కూడా నీ రాజ్యమే, ఇది కూడా నీ అయోధ్య అనే అనుకో. నీకోసమని రకరకాల పదార్ధాలు, అన్నరాసులు తీసుకొచ్చాను, తీసుకో రామా " అన్నాడు. 



గుహం ఏవ బ్రువాణం తం రాఘవః ప్రత్యువాచ హ |
అర్చితాః చైవ హృష్టాః చ భవతా సర్వథా వయం |
పద్భ్యాం అభిగమాచ్ చైవ స్నేహ సందర్శనేన చ ||




అప్పుడు రాముడు " గుహా! మా అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం నేను ఇవన్నీ తినకూడదు. కాని నువ్వు నాకోసం పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రేమతో ఈ రాజ్యం కూడా అయోధ్యే అన్నావు కదా, అప్పుడే నా కడుపు నిండిపోయింది. మా నాన్నగారికి ఈ గుర్రాలంటే చాలా ప్రీతి, అవి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి అలసిపోయాయి, వాటికి కావలసిన గడ్డి, మొదలైనవి ఇవ్వు " అన్నాడు. 

Sunday 25 March 2012

రామాయణం @ కధ -21

లోపలికి వస్తున్న రామలక్ష్మణులని చూసిన దశరథుడు పరిగెత్తుకుంటూ వాళ్ళ దెగ్గరికి వెళ్ళబోయి, మధ్యలోనే నేల మీద కళ్ళుతిరిగి పడిపోయాడు. తరువాత ఆయన తేరుకున్నాక రాముడు ఇలా అన్నాడు.....

"తండ్రీ! మీరు కోరినట్టు 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యడానికి దండకారణ్యానికి బయలుదేరుతున్నాను. నాతో పాటుగా నన్ను అనుగమించి ఉండడానికి సీత కూడా బయలుదేరింది, నన్ను విడిచి ఉండలేక లక్ష్మణుడు కూడా నాతో వస్తున్నాడు. అందుకని మేము ముగ్గురము అరణ్యానికి బయలుదేరుతున్నాము. మీరు ఈ పృథ్వికి ప్రభువులు, మాకు తండ్రి, అందుకని మాకు అనుమతిని కటాక్షించి దండకారణ్యానికి వెళ్ళడానికి అనుగ్రహించండి " అని దశరథుడి పాదాలు పట్టుకున్నాడు. 

దశరథుడు రాముడిని పైకి లేపి " నన్ను కైక వంచించి నిగ్రహించి, ఆ రెండు వరాలు ఇవ్వకపోతే వీలులేదు అని సత్యమనే పాశంతో నన్ను కట్టేసింది. కాబట్టి నేను ఇప్పుడు ఏమి చెయ్యలేని స్థితిలో ఉన్నాను. అందుకని నువ్వు నన్ను ఖైదు చేసేసి ఈ రాజ్యాన్ని తీసేసుకో, అలాగైనా నిన్ను రోజూ చూసుకోవచ్చు. నిన్ను చూడకుండా నేను ఉండలేను రామ " అని అన్నాడు. 

"మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, నేను వినకూడదు, కావున నన్ను ఆశీర్వదించండి, నేను అరణ్యాలకి వెళతాను " అని రాముడన్నాడు. 

అప్పుడు దశరథుడు " సరే రామ, నువ్వు అలాగే వెళ్ళిపో, కాని 
ఈ ఒక్క రాత్రి ఇక్కడే ఉండు, నీకు కావలసిన, కోరుకున్న భోగములన్నిటిని అనుభవించు, నేను కౌసల్యతో ఈ రాత్రంతా నిన్ను చూస్తూనే గడుపుతాము " అన్నాడు. 

అప్పుడు రాముడు " ఇవ్వాళ రాత్రి నన్ను భోగములను అనుభవించమంటున్నారు, కాని 14 సంవత్సరాలు నేను అరణ్యవాసం చెయ్యాలి కదా, అప్పుడు నాకు వీటిని ఎవరిస్తారు, 14 సంవత్సరాల అరణ్యవాసం ముందుండగా ఒక్క రాత్రి భోగాలు ఎందుకు. మీరు కైకమ్మకి ఏ మాట ఇచ్చారో ఆ మాట మీదే నిలబడి తొందరగా భరతుడికి పట్టాభిషేకం చేయించండి. నేను సంపాదించిన పుణ్యం ఏదన్నా ఉంటె దాని మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నేనేమి ఆక్రోశంతో వెళ్ళడంలేదు, మీరు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం అవసరమైతే రాజ్యాన్ని, సీతని, సుఖాన్ని, స్వర్గాన్ని కూడా వదిలేస్తాను. నేను ఎవరికైతే పుట్టానో, ఆ తండ్రి సత్యమునందు నిలబడాలి, ఆ తండ్రి సత్యమునందు నిలబడడంలో నా ప్రవర్తన వల్ల ఇబ్బంది పడకూడదు " అన్నాడు.

ఈ మాటలు విన్న దశరథుడు కైకేయ వంక చాలా అసహ్యంగా చూసి, చూడు నీ వల్ల నాకు ఈనాడు ఎటువంటి పరిస్తితి వచ్చిందో అన్నట్టు చూశాడు. కాని కైకేయ మాత్రం, నువ్వు వాళ్ళని ఇక్కడినుంచి తొందరగా పంపించెయ్యి అన్నట్టు సైగ చేసింది. ఇది గమనించిన సుమంత్రుడు ఆగ్రహంతో...... 

" ఛి, దుష్టురాల! మహా పాపి! పర్వతములను ఎలా కదపలేమో అటువంటి ధీరుడు మహారాజు, సముద్రము ఏ విధంగా క్షోభింప పడదో అటువంటి గాంభీర్యము కలవాడు మహారాజు, అటువంటి మహారాజు నిన్న రాత్రి నుండి ఏడుస్తున్నాడు, నిన్ను బతిమాలుతున్నాడు, ఇన్ని చేసినా నీ మనసు కరగలేదు. నిన్ను చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తుకు వస్తుంది, అదేంటంటే ఆడపిల్ల 90% తల్లినే పోలి ఉంటుంది. మరి నీకు నీ తల్లి పోలిక రాక ఇంకెవరి పోలిక వస్తుంది.  

నీ తల్లిగురించి మాకు తెలుసు. నీ తండ్రిగారికి సర్వప్రాణుల మనస్సులలోని విషయాలని, వాటి భాషనీ అర్ధం చేసుకునే విద్య తెలుసు. కైకేయ మహారాజు ఒకసారి మీ తల్లితో కలిసి పడుకొని ఉండగా, ఆ తల్పం పక్కన నుంచి ఒక చీమ వెళ్ళిపోతుంది, దాని పేరు జ్రుంభ. ఆ చీమ వెళ్ళిపోతూ తన పక్కన ఉన్న మరో చీమతో ఏదో చెప్పింది. కైకేయ మహారాజుకి అన్ని ప్రాణుల బాష అర్ధం అవుతుంది కనుక, ఆ చీమ మాటలు విన్న కైకేయ మహారాజు ఫక్కున నవ్వాడు. అప్పుడు నీ తల్లి, ఎందుకు నవ్వావు అని రాజుని అడిగింది. ఆ చీమల మాటలు వింటే నాకు నవ్వొచ్చింది, అందుకే నవ్వాను అన్నాడు. కాదు, ఆ చీమ నా మీద ఏదో పరిహాసం ఆడింది, అందుకే నువ్వు నవ్వావు, అసలు ఆ చీమ ఏమందో చెప్పు అనింది. నాకు ఈ విద్య నేర్పిన మహానుభావుడు ఒక నియమం పెట్టాడు, దానిప్రకారం నేను నాకు అర్ధమైన విషయాలని బయటకు చెపితే, నా తల వెయ్యి ముక్కలు అవుతుంది. అందుకని నేను నీకు చెప్పలేను అన్నాడు. అప్పుడావిడ, నీ తల వెయ్యి ముక్కలైతే నాకు వచ్చిన నష్టమేమిటి, నువ్వు ఎందుకు పరిహాసంగా నవ్వావో నాకు చెప్పాల్సిందే అనింది. అప్పుడా కైకేయ రాజు తనకి ఈ విద్య నేర్పిన మహానుభావుడి దెగ్గరికి వెళ్ళి జెరిగినది చెప్పాడు. నిజం చెప్పి నా తల పోగొట్టుకోనా, చెప్పకుండా నా తలని కాపాడుకోనా అని అడిగాడు. నీ తల వెయ్యి ముక్కలు అవుతుందన్నా విషయం చెప్పమందంటే ఆవిడ ఎంత గొప్పదో నాకు అర్ధమవుతుంది, ఆమె మళ్ళి పట్టుబడితే నువ్వు ఆమెని వదిలెయ్యి అన్నాడు. అంత మంక్కుపట్టు పట్టిన స్త్రీ, నీ తల్లి. అందుకని నీకు ఆవిడ పోలికే వచ్చింది " అని అన్నాడు. 

అప్పుడు దశరథుడు " ఆ కైకేయకి ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉండదు సుమంత్రా. మీరు కొన్ని వందల రథాలని, చతురంగ బలాలని, ఏనుగుల్ని, గాయకులని, నాట్య బృందాలని సిద్ధం చెయ్యండి. రాముడు ఎక్కడ విడిది చేస్తే అక్కడ మధురాన్నం వండగలిగే వంటగాళ్ళని సిద్ధం చెయ్యండి, 14 సంవత్సరాలు రాముడు హాయిగా గడిపి రావడానికి కావలసిన ధన రాశులని పంపండి, పట్టుచీరలు పంపండి, రాత్రి రాముడు విడిది చెయ్యడానికి డేరాలు పంపండి, ఆయనని రక్షించడానికి సైన్యాన్ని పంపండి, ఇవన్నీ రాముడు 14 సంవత్సరాలు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాలి అని శాసనం చేస్తున్నాను " అన్నాడు. ఈ మాటలు విన్న కైకేయ ఇలా అనింది.... 

" పూర్వం నీ వంశంలో సగర చక్రవర్తి అసమంజసుడిని కట్టుబట్టతో అడవులకు పంపించాడు. నువ్వేమో ఇవ్వాళ రాముడి వెనకాల చతురంగ బలాలని పంపిస్తున్నావు.  

రాజ్యం గత జనం సాధో పీత మణ్డాం సురాం ఇవ |


నిరాస్వాద్యతమం శూన్యం భరతః న అభిపత్స్యతే ||  

నువ్వు సారమంతా తీసుకెళ్ళి రాముడి వెనకాల పంపిస్తున్నావు, మిగిలిన ఆ పిప్పిని భరతుడికి ఇస్తున్నావు. అలా అయితే మాకు ఆ రాజ్యం అవసరంలేదు " అని అనింది. 

అక్కడే ఉన్న సిద్ధార్థుడు అనే మంత్రి " అసమంజసుడు పిల్లలని సరయు నదిలో తోసేసి, వాళ్ళు మరణిస్తే వేడుక చేసుకునేవాడు. అప్పుడు ప్రజలందరూ ఈ విషయాన్ని సగరుడికి చెప్పగా, తన కుమారుడు తప్పు చేస్తున్నాడని అరణ్యాలకి పంపించాడు. రాముడికి అసమంజసుడికి పోలికా? రాముడి ప్రవర్తనలో ఒక్క దోషం నువ్వు నాకు చెప్పు. అలా చెప్పగలిగితే నువ్వు కాదు, మేమే రాముడిని అరణ్యాలకి పంపించేస్తాము " అని చెప్పాడు.  

కైకేయ ఏమి మాట్లాడలేకపోయింది.  

అప్పుడు దశరథుడు " ఈ కైకేయ రాముడిలో దోషం ఎంచగలదా. కైక, నువ్వు నన్ను వరం అడిగినప్పుడు రాముడు అరణ్యాలకి వెళ్ళాలని అన్నావు కాని, రాముడి వెనకాల ఎవరూ వెళ్ళకూడదు అని అడుగలేదు, నేను నీకు అలా వరమూ ఇవ్వలేదు. అందుకని నువ్వు నాకు ఎదురు చెప్పలేవు. కాబట్టి నేను శాసించినట్టు చతురంగ బలాలు రాముడి వెనకాల వెళతాయి " అన్నాడు. 

ఈ మాటలు విన్న రాముడు " నేను తపస్వినై జీవించడానికి అరణ్యాలకి వెళుతుంటే నా వెనకాల చతురంగ బలాలు, రథాలు, ఏనుగులు ఎందుకు. నాకు ఇవేమీ వద్దు. నాకు నారచీరలు పట్టుకొచ్చి ఇవ్వండి. వాటిని కట్టుకొని నేను వెళ్ళిపోతాను " అన్నాడు.

ఈ మాటలు వినగానే, కైకేయ సంతోషంతో గబగబా లోపలికి వెళ్ళి మూడు జతల నారచీరలు పట్టుకొని వచ్చి రాముడికి ఇచ్చింది. అప్పుడు, రాముడు లక్ష్మణుడు ఇద్దరూ లోపలికి వెళ్ళి మునులు ఎలా కట్టుకుంటారో, అలా ఆ నారచీరలని కట్టుకొని వచ్చారు. అప్పుడా కైకేయ, పక్కనే పట్టుచీర కట్టుకొని ఉన్న సీతమ్మ చేతిలో ఆ నార చీర పెట్టింది.  

ఇది చూసిన వశిష్ఠుడు " పాపివైన కైకేయ, నువ్వు శృతి తప్పుతున్నావు. ఊరుకున్న కొద్దీ అవధి మించి ప్రవర్తిస్తున్నావు.  

ఆత్మా హి దారాః సర్వేషాం దారసంగ్రహవర్తినాం |
ఆత్మేయమితి రామస్య పాలయిష్యతి మేదినీం || 
 

ఇదే ముహూర్తానికి రాముడి ఆత్మ అయిన సీతమ్మకి నేను పట్టాభిషేకం చేస్తాను. రాముడు తిరిగి వచ్చే వరకు సీతమ్మ రాజ్యాన్ని ఏలుతుంది. ఎవరు అడ్డు చెప్తారో, ఎవరు నాతో ధర్మాన్ని వాదిస్తారో మీ ఇష్టం. సీతమ్మకి నారచీరలు ఇవ్వడానికి నీకున్న అధికారమేమిటి. నువ్వు రాముడిని 14 సంవత్సరాలు అరణ్యాలకి వెళ్ళమని అడిగావు, దశరథుడు ఆ కోరికని అంగీకరించాడు, కాని రాముని వెనకాల సీతమ్మ పత్నిధర్మంతో వెళుతుంది. అటువంటి సీతమ్మకి నారచీరలు ఇచ్చి నువ్వు ఘోరమైన దోషం చేశావు. 

యద్యపి త్వం క్షితితలాద్గగనం చోత్పతిష్యసి |
పితుర్వంశచరిత్రజ్ఞః సోన్యథా న కరిష్యతి || 


నువ్వు ఆకాశానికి ఎగిరిపోయి అక్కడినుంచి కింద పడిపో, భూమి మీద అడ్డంగా పడిపో, ఎగిరి గంతులు వెయ్యి, కాని తన వంశమేమిటో, తన వంశంలో పుట్టిన రాజుల చరిత్ర ఏమిటో భరతుడికి క్షుణ్ణంగా తెలుసు, అందుకని భరతుడు రేపు రాజ్యాన్ని తీసుకోడు. అప్పుడా అప్రతిష్ట అంతా నీ మీద పడుతుంది " అని వశిష్ఠుడు అన్నాడు.

సీతమ్మ నారచీరలు కట్టుకుందామని వెళ్ళి, ఆ నారచీరలని కట్టుకోవడం చేతగాక, కన్నుల నీరు పెట్టుకుని నిలబడింది. అప్పుడు రాముడు, సీతమ్మ వంటి మీద ఉన్న చీర మీదనే నారచీర ఎలా కట్టుకోవాలో కట్టి చూపించాడు. ఈ కైకేయ దురాగతాన్ని ఆపేవాడు ఎవరూలేరా అని దశరథుడి 300 మంది భార్యలు గుండెలు బాదుకొని ఏడిచారు.  

అప్పుడు దశరథుడు " కైక! ఆమె జనకుని కూతురు, నాకు కోడలిగా వచ్చింది. సీతమ్మని అరణ్యాలకి పంపమని నేను నీకు ఎన్నడూ వరం ఇవ్వలేదు. పతిని అనుగమించి ఆమె తన పాతివ్రత్యాన్ని చాటుకుంది " అని, తన కోశాధికారిని పిలిచి, 14 సంవత్సరాల పాటు సీతమ్మ కట్టుకున్న చీర కట్టకుండా ఉండడానికి ఎన్ని చీరలు కావాలో, అన్ని చీరలు తెప్పించాడు, అలాగే సీతమ్మ రోజూ పెట్టుకోడానికి నగలూరత్నములతో కూడిన ఆభరణములని తీసుకొచ్చి సీతమ్మకి ఇమ్మన్నాడు దశరథుడు.  

రామ! సీతమ్మకి ఆ నారచీర కట్టమాకు, ఆమె పట్టుచీర తోనే వస్తుందని వశిష్ఠుడు అన్నాడు.

తరువాత వాళ్ళు దశరథుడికి, కౌసల్యకి నమస్కారములు చేసి వెళ్ళిపోతుండగా, "రామా" అని పిలిచి, మళ్ళి ఆ దశరథ మహారాజు మూర్చపోయాడు. కొంతసేపటికి దశరథుడు తేరుకొని " సుమంత్ర! రాజ్య సరిహద్దులు దాటే వరకు రాముడిని రథం మీద తీసుకువెళ్ళు " అని అన్నాడు. తరువాత కోశాధికారిని పిలిచి సీతమ్మ కట్టుకునే చీరలని, ఆభరణాలని రథంలో పెట్టమన్నాడు.  

అప్పుడు కౌసల్య సీతమ్మని కౌగలించుకొని ఇలా అనింది " అమ్మ సీతా, నీకు తెలియనటువంటివి కావు, అత్తగారిని కనుక ఆర్తితో చెప్తున్నాను. ఇవ్వాళ రాముడు యువరాజ పట్టాభిషేకం పొందవలసినవాడు, కాని నారచీర కట్టుకొని అరణ్యవాసానికి వెళుతున్నాడు. ఇలాంటి స్థితిని పొందాడు కదా అని రాముడిని తక్కువగా చూడమాకు. అలాగే కుల స్త్రీకి స్వర్గం కన్నాధనం కన్నాధాన్యం కన్నా పరమోత్కృష్టమైనవాడు భర్త ఒక్కడె ".

అప్పుడు సీతమ్మ " మీరు చెప్పిన విషయాలన్నీ నేను పుట్టింట్లో తెలుసుకునే అత్తవారింటికి వచ్చాను. నేను మీ అబ్బాయిని ఎన్నడూ కష్టపెట్టను. అరణ్యవాస క్లేశం తెలియకుండా, ఆయనని ఆదమరపింపచేసి, ఆనందింపచేయడానికే నేను వారితో వెళుతున్నాను. 

Thursday 22 March 2012

రామాయణం @ కధ -19


భర్తుః కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియాః |  
స భవత్యా న కర్తవ్యో మనసా అపి విగర్హితః || 


అప్పుడు రాముడు " ఏ స్త్రీ భర్తని విడిచిపెట్టి, తాను ఒక్కత్తే భర్తకన్న వేరుగా, దూరంగా ఉంటానని మానసికంగా అయినా ఊహ చేస్తుందో, అటువంటి స్త్రీ నృశంస (ఆమెని చూడగానే "ఛి" అనవలసిన స్త్రీ). భర్తని వదిలేసి కొడుకులతో వస్తానని దశరథ మహారాజుకి పెద్ద భార్యవైన నువ్వు ఒక్కనాటికి అనకూడదు. దశరథ మహారాజు ఎంత కాలం ఉంటాడో, నువ్వు అంతకాలం ఆయనకి శుశ్రూష చెయ్యవలసి ఉంటుంది. 

భర్తారం న అనువర్తేత సా చ పాప గతిర్ భవేత్ |
భర్తుః శుశ్రూషయా నారీ లభతే స్వర్గము త్తమం |
అపి యా నిర్నమస్కారా నివృత్తా దేవపూజనాత్ || 


ఎన్ని నోములు, వ్రతాలు, పూజలు చేసినా, తన భర్త మనసు గుర్తెరిగి, భర్తకి ఆనందం కలిగేటట్టు ప్రవర్తించడం చేతకానటువంటి స్త్రీ చిట్టచివర పొందేది నరకమే. అలాగే, జీవించి ఉండగా ఎన్నడూ ఒక దేవతకి నమస్కారం చెయ్యకపోయినా, పూజలు, నోములు, వ్రతాలు చెయ్యకపోయినా కాని, భర్తని అనువర్తించి, భర్తయందు ప్రేమతో ప్రవర్తించినటువంటి స్త్రీ చిట్టచివర స్వర్గాన్నే పొందుతుంది. అందుకని అమ్మ, నువ్వు అలా మాట్లాడకూడదు, నేను అలాంటి మాటలు వినకూడదు. నేను అరణ్యవాసానికి వెళితే నన్ను రక్షించేది చల్లని నీ ఆశీర్వాదమే అమ్మ" అని కౌసల్య పాదాలకి నమస్కారం చేశాడు. 

అప్పుడు కౌసల్య తెల్లటి ఆవాలు, పెరుగు, తెల్లటి పూలతో ఉన్న దండలు తెప్పించి వేదం బాగా చదువుకున్నటువంటి ఆచార్యుడిని పిలిచి, హోమం చేయించి, ఆ అక్షతలని రాముడి శిరస్సు మీద ఉంచి " నాయనా, నిన్ను సూర్యుడు, చంద్రుడు, అశ్విని దేవతలు, భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు, దిక్కులు, గృహదేవతలు, రాక్షసులు, విషక్రిములు, చెట్లు, నదులు, ఋతువులు, నక్షత్రములు అన్నీ నిను రక్షించాలి. ఆ వృత్తాసురిడిని చంపినప్పుడు దేవేంద్రుడికి ఎటువంటి మంగళం జెరిగిందో, నీకు అటువంటి మంగళం జెరుగుగాక, గరుగ్మంతుడు అమృతాన్ని అపహరించి తెచ్చినప్పుడు ఎటువంటి మంగళం జెరిగిందో, నీకు అటువంటి మంగళం జెరుగుగాక, క్షీరసాగర మధనంలో రాక్షసులని సంహరించిన ఇంద్రుడికి అదితి నుంచి ఎటువంటి మంగళం లభించిందో, నీకు అటువంటి మంగళం కలుగుగాక, పాదముల చేత ఈ లోకములనన్నిటిని కొలిచిన త్రివిక్రమావతారానికి ఎటువంటి మంగళం లభించిందో,  అటువంటి మంగళం నీకు లభించుగాక " అని ఆశీర్వదించింది. 

కౌసల్య దెగ్గర ఆశీసులు తీసుకున్నాక రాముడు సీతమ్మ దెగ్గరికి బయలుదేరాడు. తన తల్లి దెగ్గర ఎంత గంభీరంగా ఉన్నా, సీతమ్మ దెగ్గరికి వచ్చేసరికి రాముడి ముఖం వివర్ణం అయిపోయింది. సీతమ్మ రాముడికి ఎదురుగా వచ్చి " ఎప్పుడూ కాంతితో మెరిసిపోయే మీ ముఖం ఏదో ఒక నల్లటి రంగుతో కూడి ఉంది. ఏదో తప్పు చేసినవారిలా మీ కనురెప్పలు కిందకి వంగి ఉన్నాయి, నూరు ఊచలు కలిగిన తెల్లటి గొడుగుని మీకు పట్టాలి కదా, మీకు ఎదురుగా భద్రగజం నడవాలి కదా, మీ వెనకాల చతురంగ బలాలు నడిచి రావాలి కదా, ఇవన్నీ ఎందుకు జెరగలేదు " అని రాముడిని అడిగింది. 

అప్పుడు రాముడు తలదించుకొని " సీత! మా తండ్రిగారిని కైకేయ రాత్రి రెండు వరాలు అడిగింది. పధ్నాలుగు సంవత్సరాలు నన్ను అరణ్యవాసం చెయ్యమని అడిగింది. సత్యమునకు ధర్మమునకు బద్ధుడైన నా తండ్రి నన్ను అరణ్యవాసం చెయ్యమని శాసించారు. అందుకని నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాను. అలాగే భరతుడికి పట్టాభిషేకం చెయ్యమని అడిగింది. భరతుడికి పట్టాభిషేకం చేశాక, భరతుడు ఈ రాజ్యానికి రాజు అవుతాడు. నేను వదినని అవుతాను కదా అని గబుక్కున చొరవగా మాట్లాడతావేమో, ఇప్పుడు నువ్వు భరతుడి చేత రక్షింపబడుతున్న స్త్రీవి, అందుకని అంత చొరవగా మాట్లాడమాకు. ఆయనని ప్రభువుగా గౌరవించడం నేర్చుకో, నా తల్లి అయిన కౌసల్యకి సపర్య చెయ్యి. కౌసల్య, సుమిత్ర, కైకేయ మరియు దశరథుడి ఇతర భార్యలని సేవించు. నేను వెళ్ళిపోయాక మా అమ్మ అన్నం తినకుండా ఏడుస్తూ ఉంటుంది, కావున మా అమ్మ కన్నీరు తుడిచి, మంచి మాటలు చెప్పి ఆమెని సేవించు " అని అన్నాడు.

అప్పుడు సీతమ్మ " మీరు చెప్పినవన్నీ నాకు బాగానే వినబడ్డాయి కాని ఒకమాటే అర్థం కాలేదు, నువ్వు ఉండు నేను వెళతాను అన్నట్టు మాట్లాడుతున్నారేంటి, మనం వెళతాము అని అనాలి కదా మీరు. మీరు మీ నాన్నగారిని ధర్మమునందు నిలబెట్టడానికి వెళతాను అంటున్నారు కదా, నాకు కూడా ఒక ధర్మం తెలుసు, చెప్తాను వినండి.......
ఒకే ఇంట్లో తల్లి, తండ్రి, కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు ఉంటారు. ఇంటి యజమాని తీసుకొచ్చిన భాగ్యాన్ని మిగిలినవారందరూ పంచుకుంటారు. కాని, భర్తతో సుఖం కాని, కష్టం కాని పంచుకోడానికి అన్నికాలములయందు భర్త కన్నా వేరుగా చూడబడలేని రీతిలో ఉన్నది భార్య ఒక్కత్తే. అందుకని నేను కూడా మీతో పాటు అరణ్యాలకి వచ్చేస్తాను. 

న పితా న ఆత్మజో న ఆత్మా న మాతా న సఖీ జనః |
ఇహ ప్రేత్య చ నారీణాం పతిర్ ఏకో గతిః సదా || 

తల్లి కాని, తండ్రి కాని, అన్నదమ్ములు కాని, అక్కచెల్లెళ్ళు కాని, కడుపున పుట్టిన బిడ్డలు కాని, రాజ్యం కాని, సంపద కాని, ఇవి ఏవి స్త్రీకి గతి కావు. సుఖమైనా కష్టమైనా స్త్రీ పొందవలసిన గమ్య స్థానము భర్త. నీతో పాటు వచ్చేసిన తరువాత, అక్కడ హంసలు మొదలైన పక్షులు స్నానం చేస్తూ ఆడుకునేటటువంటి సరోవరాలలో స్నానం చేస్తూ నీతో పాటు క్రీడించడంలో ఇష్టాన్ని పొందుతాను, నీతో కలిసి నడుస్తూ, నీ పక్కన కూర్చున్నప్పుడు పొందే సుఖం ముందు, మూడు లోకాలని తీసుకొచ్చి నాకు ధారపోసినా, నీ పక్కన కూర్చున్న సుఖం రాదు. అందుకని నేను నీతోనే వస్తాను " అని సీతమ్మ అనింది.

అప్పుడు రాముడు " సీతా! నీకు తెలియదు. నా వెంట వస్తానంటున్నావు. నేను వెళుతున్నది అరణ్యాలకి. అరణ్యంలో నదిలో స్నానం చేద్దామని లోపలికి వెళితే మొసళ్ళు పట్టుకుంటాయి. రాత్రి పూట దోమలు కుడతాయి. చీమలు, పాములు ఉంటాయి. రాలిపోయిన ఆకుల మీద పడుకోవాలి. క్రూరమృగాలు సంచరిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మహానుభావులు వస్తారు, అప్పుడు వాళ్ళకి అరణ్యంలో ఉన్న సపర్యలన్నీ చెయ్యవలసి ఉంటుంది. కొన్ని సార్లు ఆహారం దొరకదు, అలా ఆహారం లేకుండానే తిరగవలసి ఉంటుంది, నీళ్ళు దొరకకపోతే అలా దాహంతోనే తిరగాలి. అడవులలో ముళ్ళు గుచ్చుకుంటాయి. ఇన్ని కష్టాలు పడుతూ అరణ్యవాసం చెయ్యాలి, అందుకు తగిన జీవితం నీది కాదు. అందుకని నువ్వు ఇక్కడే ఉండు, నేను పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసి తిరిగోస్తాను " అన్నాడు.

యే త్వయా కీర్తితా దోషా వనే వస్తవ్యతాం ప్రతి |
గుణాన్ ఇతి ఏవ తాన్ విద్ధి తవ స్నేహ పురః కృతాన్ || 


అప్పుడు సీతమ్మ " నువ్వు చెప్పినవన్నీ నిజమే అయ్యుండచ్చు, కాని రామ, నువ్వు పక్కన కూర్చొని సీతా! అని ప్రీతిగా మాట్లాడితే, ఇవన్నీ నాకు సుఖాలు అవుతాయి, అదే నువ్వు పెడముఖంతో ఉంటె మాత్రం, నేను ఎన్ని భోగభాగ్యాల మధ్య ఉన్నా, అవన్నీ నాకు విషం అవుతాయి. నాకు కూడా మా తండ్రిగారు వివాహ సమయంలో ఒక ధర్మం చెప్పారు, నేను నీ వెంట నీడలా వస్తానని. నువ్వు పెద్దల మాటలకు కట్టుబడి అడవులకు వెళుతున్నావు, మరి నేనూ పెద్దల మాటలకు కట్టుబడి నీ వెంట అడవులకు రావాలి కదా. చిన్నప్పుడు నా జాతకాన్ని చూసిన జ్యోతిష్యులు నేను కొంత కాలం వనవాసం చేస్తానని చెప్పారు. అంతఃపురంలో ఉండు, ఇక్కడ నిన్ను అందరూ రక్షిస్తారు, అడవులకు వస్తే పులులు, సింహాలు ఉంటాయి అంటావు, నువ్వు నన్ను రక్షించలేవా, అసలు నిన్ను చూస్తే అవన్నీ పారిపోవా, అలాంటిది ఇవ్వాళ ఇలా చేతకానివాడిలా మాట్లాడుతున్నావు. నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నువ్వు పురుష రూపంలో ఉన్న స్త్రీవని తెలియక, నన్ను మా నాన్న నీకిచ్చి కన్యాదానం చేశాడు. నీతోపాటు ఇంత తేనె తాగినా, ఒక పండు తిన్నా, నా కడుపు నిండిపోతుంది రామ, ఒకవేళ ఆ రోజూ ఏమి దొరకకపోతే, నీతో మాట్లాడుతూ ఉండడం వల్ల నేను ఆ కష్టం మరిచిపోతాను. నేను ముందు నడిచి దర్భలను తోక్కుక్కుంటూ వెళతాను, కాబట్టి అవి మెత్తగా అవుతాయి, అప్పుడు నువ్వు నా వెనకాల హాయిగా రా, నేను నిన్ను ఎన్నడూ కష్టపెట్టను, నన్ను నమ్మితే నీతోపాటు తీసుకెళ్ళు, లేకపోతే నా ప్రాణాలు విడిచిపెట్టడానికి అనుమతినివ్వు " అని రాముడిని గట్టిగా కౌగలించుకొని, ఆయన గుండెల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది. 

అప్పుడు రాముడు " సీతా! నిన్ను విడిచి నేను ఉండగలనా. పధ్నాలుగు సంవత్సరాలు నీకు దూరంగా నేను ఉండలేను. కాని, భర్త ఎన్నడూ అది కష్టమని తెలిసి భార్యని నాతో రా అని శాసించకూడదు. ఇంత కష్టానికి వెళదాము అని నేను అనకూడదు, ప్రయత్నపూర్వకంగా భర్త భార్యని కష్టపెట్టకూడదు, భార్య ఉండలేక తనని అనుసరించి వస్తే తీసుకెళ్ళాలి. ఆ అభిప్రాయం నీ నోటవెంట వచ్చాక నిన్ను తీసుకెళ్లడం నా ధర్మం, అందుకని వద్దు అన్నాను. నీవంటి భార్యని పొంది నేను అదృష్టవంతుడినయ్యాను. కనుక నువ్వు ఇక్కడున్నటువంటి వాటన్నిటిని దానం చేసెయ్యి " అన్నాడు.

కోశాధికారిని పిలిచి తన దెగ్గరున్న ద్రవ్యాన్ని దానం చేశాడు, తన వస్త్రములని, ఆభరణములని వశిష్ఠుడి కుమారుడైన సుయజ్ఞుడికి దానం చేశాడు. గోవుల్ని బ్రాహ్మణులకి దానం చేశాడు. అప్పటివరకు బయటనే ఉన్న లక్ష్మణుడు పరిగెత్తుకుంటూ వచ్చి రాముడి కాళ్ళని గట్టిగా పట్టుకొని " నిన్ను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా నేను బతకలేను అన్నయ్య, ఇంతసేపు సీతమ్మ తల్లినే రావద్దన్నావు, నన్ను రమ్మంటావో, వద్దంటావో అని భయం పట్టుకుంది నాకు. నువ్వు  కాని నన్ను తీసుకెళితే, మీ ఇద్దరూ హాయిగా సరోవరాల్లో, పర్వతాల మీద సంతోషంగా తిరుగుతుంటే, నేను మీకోసం పర్ణశాల నిర్మిస్తాను, ఆహారం తీసుకొస్తాను. మీ ఇద్దరూ అవి తింటూ ఉంటె నాకు పరమ ఆనందంగా ఉంటుంది " అన్నాడు. 

అప్పుడు రాముడు " నిన్ను కూడా తీసుకెళితే కౌసల్యని, సుమిత్రని, కైకేయని ఎవరు చూసుకుంటారు. అందుకని నువ్వు ఇక్కడే ఉండు " అన్నాడు. 

"నేను కౌసల్యని, సుమిత్రని చూడడమేమిటి అన్నయ్యా, కౌసల్యకి వెయ్యి గ్రామాలు ఉన్నాయి. నాలాంటి వాళ్ళని లక్ష మందిని ఆవిడ పోషించగలదు. ఇంక నాకు ఇలాంటి సాకులు చెప్పద్దు, నేను సమాధానం చెప్పలేను. వచ్చెయ్ లక్ష్మణా, అని ఒక్క మాట అను, నేను గబగబా వచ్చేస్తాను " అన్నాడు లక్ష్మణుడు.

నీలాంటి వాడు నాకు తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం అని, లక్ష్మణుడిని రాముడు వచ్చెయ్యమన్నాడు. ఈ మాట విన్న లక్ష్మణుడు ఎంతో సంతోషపడ్డాడు. తన మిత్రులందరితో సంతోషంగా ఈ వార్త చెప్పి, తన వస్తువులని కూడా దానం చేశాడు. అలా సీతారామలక్ష్మణులు దశరథుడి ఆశీర్వాదం కోసమని ఆయన అంతఃపురానికి బయలుదేరారు.


రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు రాచవీధులలో నడుచుకుంటూ దశరథ మహారాజు ఉన్నటువంటి కైకేయ మందిరానికి పయనమయ్యారు. వారు అలా వెళుతుంటే చూస్తున్నటువంటి ప్రజలందరూ కన్నీరు పెట్టారు. ఎక్కడో హంసతూలికా పాన్పుల మీద ఉండవలసిన జనకుడి కూతురు, దశరథుడి పెద్ద కోడలు, రాముడి ఇల్లాలు అయినటువంటి సీతమ్మ నేడు ఇలా రాచవీధులలో పాదచారిగా, నలుగురు చూస్తుండగా రాముడి వెనకాల నడుచుకుంటూ వెళుతుంది. కాలం అంటె ఇదే కదా, నిన్న రాత్రి పట్టాభిషేకం అనుకున్న రాముడికి నేడు అరణ్యవాసం చెయ్యవలసిన స్థితి ఏర్పడిందని అందరూ విశేషమైన గౌరవభావంతో చూడడానికి వచ్చారు. అలా వారు దశరథ మహారాజు ఉన్నటువంటి ప్రాసాదానికి చేరుకున్నారు. 

" రాముడు, సీతాలక్ష్మణ సహితుడై వచ్చాడని మా తండ్రిగారికి నివేదించండి, నేను నా ప్రాసాదములోని సమస్త వస్తువులని దానం చేసేసి వచ్చాను. ఒక్కసారి వారి దర్శనం చేసుకోని నేను బయలుదేరదామని అనుకుంటున్నాను " అని అక్కడే ఉన్నటువంటి సుమంత్రుడితో రాముడు చెప్పాడు. రాముడు చెప్పిన మాటలని సుమంత్రుడు దశరథుడికి చెప్పగా, దశరథుడు ఇలా అన్నాడు....

"సుమంత్రా, రాముడిని దర్శనానికి లోపలికి పంపకు, రాముడికంటే ముందు, నా భార్యలందరినీ తీసుకొని కౌసల్యని ఇక్కడికి రమ్మను " అని దశరథుడు అన్నాడు. అప్పుడు కౌసల్య, సుమిత్ర మరియు ఇతర భార్యలతో కలిసి ఆ ప్రాసాదములోకి వచ్చాక, సుమంత్రుడిని పిలిచి రాముడిని లోపలికి తీసుకురమ్మన్నాడు దశరథుడు.